హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ జైళ్లలో మగ్గుతున్న 213 మంది ఖైదీలకు విముక్తి లభించనుంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళవారం రాష్ట్ర హోంశాఖ జీవో విడుదల చేసింది. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ వారిని విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రజా పాలనలో దరఖాస్తులు అందించారు. బాధితుల దరఖాస్తులపై స్పందించిన సీఎం.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల జైళ్ల మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.
సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల కోసం సీనియర్ అధికారులతో హై లెవల్ కమిటీ ఏర్పాటు చేశారు. అర్హులైన వారి వివరాలు సేకరించాలని సూచించారు. కమిటీ అందించిన నివేదిక ఆధారంగా విడుదలకు అర్హులైన వారి జాబితాను కేబినెట్ ముందు పెట్టి.. ఖైదీల విడుదలకు ఆమోదముద్ర వేశారు. ఆ జాబితాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఖైదీల ముందస్తు విడుదలకు మార్గం సుగమం అయింది.
ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలను బుధవారం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. అక్కడి నుంచి 213 మంది ఖైదీలు విడుదల కానున్నారు. వీరిలో 205 మంది యావజ్జీవ శిక్ష పడిన వారు ఉండగా.. 8 మంది తక్కువ కాలం శిక్షపడిన వారున్నారు. వీరంతా జైళ్లలో వివిధ వృత్తులకు సంబంధించి శిక్షణ పొందారు.
