ఖమ్మం జిల్లాలో మోడల్ సోలార్ విలేజ్ కోసం గ్రామాల మధ్య పోటాపోటీ!

ఖమ్మం జిల్లాలో మోడల్ సోలార్ విలేజ్ కోసం గ్రామాల మధ్య పోటాపోటీ!
  • ఖమ్మం జిల్లాలో 8,  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 14 గ్రామాల మధ్య పోటీ
  • 5 వేల జనాభా మించి ఉన్న ఊర్లకు అవకాశం
  • ఈ ఏడాది అక్టోబర్​ మొదటివారం వరకు గడువు
  • ఎంపికైన గ్రామానికి రూ.కోటి కేంద్ర ప్రభుత్వ నిధులు

ఖమ్మం, వెలుగు:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మోడల్ సోలార్ విలేజ్​ ఎంపిక కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం జిల్లాకు ఒక గ్రామాన్ని ఎంపిక చేసేందుకు గాను అర్హత ఉన్న గ్రామాలను ఇప్పటికే ఆఫీసర్లు గుర్తించారు. 5 వేల జనాభాకు మించి ఉన్న రెవెన్యూ గ్రామాలకు మాత్రమే అవకాశం ఉండడంతో, ఖమ్మం జిల్లాలో 8 రెవెన్యూ గ్రామాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 గ్రామాలు ప్రస్తుతం పోటీపడుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్​ నాటికి ఈ గ్రామాలకు గాను ఏ గ్రామంలో అయితే ఎక్కువ మంది ఇండ్లపై సొంతంగా సోలార్​ ప్యానెల్స్​ ఏర్పాటు చేసుకొని ఉంటారో, ఆ గ్రామాన్ని ఎంపిక చేస్తారు. 

జిల్లాకొకటి చొప్పున మోడల్ సోలార్​ విలేజ్​ గా ఎంపిక చేసి, కేంద్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేస్తుంది. ఈ రూ.కోటి నిధులతో ఆ గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయం, వ్యవసాయ బోర్లు, ప్రభుత్వాస్పత్రి, పోలీస్​ స్టేషన్, తహసీల్దార్​ ఆఫీస్​ లాంటి ప్రభుత్వ భవనాలకు సోలార్​ విద్యుత్​ బిగించుకోవాల్సి ఉంటుంది. ఆయా గ్రామ పంచాయతీలపై ఆర్థిక భారం లేకుండా అన్ని ప్రభుత్వాఫీసుల్లో సోలార్​ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా, ఆ జీపీకి వచ్చే ఆదాయాన్ని  గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 

మేజర్​ ఖర్చులో కరెంటు బిల్లు ఒకటి... 

గ్రామ పంచాయతీకి ఉండే మేజర్​ ఖర్చులో కరెంటు బిల్లు కూడా ఒకటి. స్ట్రీట్ లైట్స్​ సహా ప్రభుత్వ భవనాలకు ఉపయోగించే కరెంటు బిల్లును పంచాయతీ ఆదాయం నుంచే ఖర్చు చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్కీమ్​ కింద రూ.కోటి ప్రోత్సాహకానికి ఎంపికైతే ఉచితంగా కరెంటు వాడుకునే అవకాశం కలుగుతుంది. ఆ మిగులు నిధులను రోడ్లు, లేదా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రధానమంత్రి సూర్యఘర్ కింద గ్రామాల్లో సోలార్​ విద్యుత్​ కేంద్రాలను ఏర్పాటును ప్రోత్సహించనున్నారు. 

ఇటీవల కలెక్టర్​ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం తర్వాత ఎంపిక చేసిన గ్రామాల మధ్య పోటీ ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారం నాటికి ఏ గ్రామంలో ప్రజలు స్వయంగా ఎక్కువ సోలార్​ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే, ఆ గ్రామాన్నే స్కీమ్​ అమలు కోసం ఎంపిక చేస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంటు స్కీమ్ తో గ్రామాల్లో దాదాపు 70 శాతం మంది అర్హులుగా ఎంపికయ్యారు. సర్పంచ్​, పాలకవర్గాలు లేకపోవడంతో మిగిలిన వారిలో ఇండ్లపై సొంతంగా సోలార్​ ప్లాంట్లు బిగించుకునేందుకు గ్రామస్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శులపై పడింది. 

రాష్ట్ర ప్రభుత్వం కూడా..  

కేంద్ర ప్రభుత్వ పథకం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ​మోడల్ సోలార్ విలేజ్​ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్​ కింద ఖమ్మం జిల్లా బోనకల్ మండలాన్ని పూర్తిగా ఎంపిక చేయగా, పాలేరు నియోజకవర్గంలో చెరువుమాదారం, వైరా నియోజకవర్గంలోని శ్రీరామగిరి, మధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామాలను ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సోలార్​ ప్యానెళ్లను ఏర్పాటు చేసి ఇండ్లు, వ్యవసాయానికి ఉచిత సోలార్​ విద్యుత్​ అందించనున్నారు. ఈ స్కీమ్​ కింద ఖమ్మం జిల్లాలో 20 వేల కుటుంబాలకు లబ్ధి జరగనుంది. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పోటీపడుతున్న గ్రామాలివే..!

గ్రామం    మండలం
అశ్వాపురం    అశ్వాపురం
భద్రాచలం    భద్రాచలం
సారపాక    బూర్గంపాడు
బూర్గంపాడు    బూర్గంపాడు
నాగినేనిప్రోలు    బూర్గంపాడు
చంద్రుగొండ    చంద్రుగొండ
రుద్రంపూర్​    చుంచుపల్లి
బాబుక్యాంప్​    చుంచుపల్లి
దమ్మపేట    దమ్మపేట
మందలపల్లి    దమ్మపేట
కూనవరం    మణుగూరు
సమితిసింగారం     మణుగూరు
సుజాతనగర్​    సుజాతనగర్​
చర్ల    చర్ల

ఖమ్మం జిల్లాలో పోటీపడుతున్న గ్రామాలివే!

గ్రామం    మండలం అన్నారుగూడెం    తల్లాడ
తనికెళ్ల    కొణిజర్ల
నేలకొండపల్లి    నేలకొండపల్లి
తల్లాడ    తల్లాడ
కొణిజెర్ల    కొణిజెర్ల
ముదిగొండ    ముదిగొండ
వల్లభి    ముదిగొండ
కందుకూరు    వేంసూరు