
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ ఎదుట శనివారం 23 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.1.18 కోట్ల రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో 2012లో సుక్మా కలెక్టర్ ఎలెక్స్ పాల్ మీనన్‌ను కిడ్నాప్ చేసిన, 46 మంది జవాన్ల ఊచకోత కేసులో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, దక్షిణ సబ్ జోనల్ బ్యూరో కమాండర్ లోకేశ్ అలియాస్ పొడియం భీమా కూడా ఉన్నాడు.
ఇతను 2017లో బుర్కాపాల్, 2021లో టేకులగూడలో జరిగిన ఎన్కౌంటర్లలో కీలకసూత్రధారి. భీమాతో పాటు9 మంది మహిళలు, ముగ్గురు దంపతులు లొంగిపోగా, వీరిలో 8 మంది కీలక కమాండర్లు, ఒక డీవీసీఎం, ఆరుగురు పీపీసీఎం, నలుగురు ఏసీఎంలు, 12 మంది దళ సభ్యులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. 11 మందిపై రూ.8 లక్షల చొప్పున, నలుగురిపై రూ.5 లక్షలు, ఒకరిపై రూ.3లక్షలు, ఏడుగురిపై రూ. లక్ష చొప్పున రివార్డు ఉందని చెప్పారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.
భద్రాద్రి జిల్లాలో ఆరుగురు..
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ బి.రోహిత్ రాజు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పూనెం లాలు, మడవి నందు, మడకం దేవ, బీమా, ముచకి దేవ, మడవి ముయె లొంగిపోయారని చెప్పారు. ఆపరేషన్ చేయూత ద్వారా లొంగిపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇప్పటి వరకు 300 మంది లొంగిపోగా, రూ. 58 లక్షల ఆర్థికసాయం అందజేశామన్నారు. నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు.