న్యూఢిల్లీ: పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ , ముంబై, కోల్‌కతా సహా ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర మంగళవారం రూ.850 పెరిగి రూ.64,850లకు చేరింది. చెన్నైలో అయితే 24 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములకు రూ.65,620గా ఉంది. హైదరాబాద్‌లో ధర రూ.64,850 ఉంది. బంగారం మాదిరిగానే, వెండి ధరలు కిలోకు రూ.900 పెరిగి రూ.74,900కి చేరాయి.
క్రితం ముగింపులో కిలోకు రూ.74,000 ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లోని సీనియర్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, "ఢిల్లీ మార్కెట్లలో స్పాట్ బంగారం ధరలు (24 క్యారెట్లు) 10 గ్రాములకు రూ.65,000 వద్ద ట్రేడవుతున్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి బుల్లిష్ సూచనల కారణంగా పుత్తడి రూ.800 పెరిగింది. స్పాట్ గోల్డ్ మంగళవారం కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.65 వేల మార్కును తాకింది. కమోడిటీ ఎక్స్ఛేంజ్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 2,110 డాలర్ల వద్ద ట్రేడవుతోంది”అని ఆయన వివరించారు.
ఈ ఏడాది జూన్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే ఊహాగానాల కారణంగా బంగారం ధరలు పెరిగాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ జతీన్ త్రివేది చెప్పారు. అమెరికాలో పారిశ్రామిక, నిర్మాణ వ్యయం మందగించడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల తగ్గుదల వంటి సంకేతాలు కూడా ఈ పెరుగుదలకు కారణమయ్యాయని వివరించారు. అమెరికాలో వెండి ధర కూడా ఔన్సుకు 23.88 డాలర్లు పలికింది. క్రితం ట్రేడింగ్‌లో ఔన్స్‌కు 23.09 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్ బలంగా ఉన్నప్పటికీ బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. చాలా మంది బంగారాన్ని పెట్టుబడి కోసం కొంటుంటారు. యూఎస్ డాలర్, ప్రభుత్వ విధానాలు, ప్రపంచ పరిస్థితులతో సహా వివిధ అంశాలపై పసిడి ధర ఆధారపడి ఉంటుంది.
