24 గంటల కరెంట్ కాంగ్రెస్ కృషి ఫలితమే : కేసీ జార్జ్​

24 గంటల కరెంట్  కాంగ్రెస్ కృషి ఫలితమే : కేసీ జార్జ్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ చెప్తున్నారంటే అది గత కాంగ్రెస్ ప్రభుత్వ కృషి ఫలితమేనని కర్నాటక విద్యుత్ శాఖ మంత్రి కేసీ జార్జ్ అన్నారు. కర్నాటకలో కరెంట్ లేదంటూ కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, రైతులకు అవసరమైనంత వరకు కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. గురువారం గాంధీ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం నాడు ఇందిరా గాంధీ అమలు చేసిన 20 సూత్రాల పథకం ఇప్పటికీ అమలవుతున్నదని చెప్పారు. కర్నాటకలో అధికారంలోకి వచ్చాక 90 శాతం హామీలను అమలు చేశామని ఆయన తెలిపారు. ఐదు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుని, అమలు చేస్తున్నామని చెప్పారు.

అన్న భాగ్య కింద పేదలకు ఉచితంగా 10 కిలోల బియ్యం ఇవ్వాలనుకున్నామని, కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వకపోవడంతో నేరుగా డబ్బులను ఇస్తున్నామని వెల్లడించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్నాటకలో ఆయన ఎంతో మందిని కలిశారని, వారు చెప్పిన విషయాలనే మేనిఫెస్టోలో చేర్చామన్నారు.ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నదని ఆయన తెలిపారు. ఏఐసీసీ మీడియా ఇన్‌‌చార్జి, సీడబ్ల్యూసీ మెంబర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, కర్నాటకలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల కరెంట్‌‌ను ఉచితంగా ఇస్తున్నదన్నారు. ఫ్రీ కరెంట్ ఇవ్వడం దేశంలోనే మొదటిసారి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెప్తున్నారని ఫైర్ అయ్యారు. డిస్కంలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పడిందని గుర్తుచేశారు. కర్నాటక అమలు చేస్తున్న ఫ్రీ కరెంట్‌‌పై కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.