ఆదిలాబాద్ లో సక్రమంగా సరఫరా కాని 24 గంటల ఉచిత విద్యుత్​

ఆదిలాబాద్ లో  సక్రమంగా సరఫరా కాని 24 గంటల ఉచిత విద్యుత్​
  • 24 గంటల కరెంట్ సరఫరా ఉత్తదే
  • నిరసనలకు దిగుతున్న రైతులు
  • దుబారా చేస్తారని ఇస్తలేమంటున్న ఆఫీసర్లు
  • రబీలో లక్ష ఎకరాల్లో పంట సాగుకు రెడీ 

ఆదిలాబాద్,వెలుగు: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్​ సక్రమంగా సరఫరా కావడంలేదు. దీంతో రబీ సాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడంలేదు. దీంతో రైతులు ఆందోళన బాటపడుతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న తొమ్మిది గంటల విద్యుత్​ ఒకేసారి గృహ, వ్యవసాయానికి సరఫరా చేస్తుండడంతో లోవోల్టేజీ సమస్య ఏర్పడుతోంది. దీంతో  ఫీజులు, స్టార్టర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దుబారా చేస్తారని..

జిల్లాలో గృహ, వ్యవసాయ కనెక్షన్లు మొత్తం రెండు లక్షల వరకు ఉంటాయి. ఇందులో వ్యవసాయ కనెక్షన్లు 27 వేల వరకు ఉంటాయి. రబీలో దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు సాగుకానున్నాయి. 

ఆరుతడి పంటలు కావడంతో విధిగా పొలానికి నీళ్లవసరం. ప్రస్తుతం 90 వేలకు పైగా ఎకరాల్లో శెనగ, 15 వేల ఎకరాల్లో జొన్న, మిగతావి గోధుమ, పల్లి సాగు చేస్తున్నారు. ఎకరం తడవాలంటే దాదాపు ఐదారు గంటల టైం పడుతుంది. ఇలాంటి సమయంలో త్రీఫేజ్ కరెంట్ లేకపోతే రెండు రోజుల్లో చేసేపని ఐదారు రోజులు పడుతుందని రైతులు వాపోతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత సింగిల్ ఫేజ్ మాత్రమే కరెంట్​ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా కరెంట్ దుబారా చేస్తారనే ఉద్దేశంతోనే అంతటా కరెంట్ సరఫరా చేయడం లేదని, ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి మాత్రమే ఇస్తామని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు కోతలు విధించడం సరైంది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈయన పేరు కోడి నారాయణ. ఊరు ఆదిలాబాద్​జిల్లా గిర్నూర్. రబీలో పది ఎకరాల్లో శెనగ సాగు చేశాడు. వారం రోజుల నుంచి కరెంటు సరఫరా సరిగా లేకపోవడంతో వ్యవసాయ ఎకరానికే  సాగు నీళ్లే అందుతున్నాయి. ఇప్పటికే ఎండిపోతున్న పంటలో మూడు ఎకరాలు పందులు తినేశాయి. ఇది ఒక్క నారాయణ పరిస్థితి కాదు. జిల్లా వ్యాప్తంగా రైతుల దుస్థితి.

అవసరం ఉన్న వారికి ఇస్తున్నాం..

రబీ సాగులో అవసరం ఉన్న రైతులకు కరెంట్ సరఫరా చేస్తున్నాం. 24 గంటలు కరెంట్ సరఫరా చేయడంతో చాలా మంది దుబారా చేస్తున్నారు. మిగతా చోట్ల త్రిఫేజ్ కరెంట్ ఇవ్వడం లేదు.

– ఉత్తం జాడే, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ