కర్ణాటకలో కొత్త మంత్రులు.. డీకే శివకుమార్ కు ఇచ్చిన శాఖ ఇదే

కర్ణాటకలో కొత్త మంత్రులు.. డీకే శివకుమార్ కు ఇచ్చిన శాఖ ఇదే

కర్ణాటకలో కొత్తగా ఏర్పాడిన సిద్ధరామయ్య సర్కార్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో 24 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక ప్రభుత్వంలో 34మంది మంత్రులు ఉండొచ్చు. వీరిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సహా 10 మంది మే 20న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన వారం రోజుల తర్వాత క్యాబినెట్ విస్తరణ జరిగింది. శనివారం (మే 27న) 11 గంటల 45 నిమిషాలకు రాజ్‌భవన్‌లో 24 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. 

మిగిలిన 24 మంది కొత్త మంత్రులు శనివారం (మే 27న)  ప్రమాణస్వీకారం చేశారు. కొత్త మంత్రులైన ఎమ్మెల్యేల జాబితాలో దినేష్ గుండూరావు, కృష్ణ బైరేగౌడ, ఈశ్వర్ ఖండ్రే, శివరాజ్ తంగడి, ఆర్‌బి.తిమ్మాపూర్, బి.నాగేంద్ర, లక్ష్మీ హెబ్బాల్కర్, మధు బంగారప్ప, డి. సుధాకర్, చెలువరాయ స్వామి, మంకుల్ వైద్య, ఎంసీ, సుధాకర్, రహీం ఖాన్, సంతోష్ లాడ్, కెఎన్.రాజన్న, కె. వెంటకేశ్, హెచ్‌సీ మహదేవప్ప, బైరతి సురేష్ ఉన్నారు. తాజాగా ప్రమాణస్వీకారం చేసిన 24 మందిలో తొమ్మిది మంది తొలిసారిగా ఎన్నికైన వారు ఉండడం విశేషం. అందులో ఒక మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నారు. 

సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఆరుగురు వొక్కలిగలు, ఎనిమిది మంది లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. ముగ్గురు మంత్రులు షెడ్యూల్డ్ కులాలు, ఇద్దరు షెడ్యూల్డ్ తెగలు, ఐదుగురు ఇతర వెనుకబడిన వర్గాల వారికి అవకాశం దక్కింది. క్యాబినెట్‌లో బ్రాహ్మణులకు కూడా ప్రాతినిధ్యం లభించింది. సీనియర్‌, జూనియర్‌ అనే తేడా లేకుండా అందరు ఎమ్మెల్యేలకు సముచిత గౌరవం ఇవ్వడంతో పాటు కుల, ప్రాంతాల వారీగా ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణలో సమతూకం పాటించారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 

మంత్రుల శాఖలు ఇవే

కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు ఇతర మంత్రులందరికీ శాఖలను కేటాయించారు. మొత్తం 34 మంది మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. అందులో ముఖ్యమంత్రితోపాటు, ఉప ముఖ్యమంత్రి, 32 మంది ఇతర మంత్రులు ఉన్నారు. అయితే, సీఎం సిద్ధూ ఆర్థిక శాఖను మాత్రం తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. ఆర్థిక శాఖతోపాటు వ్యక్తిగత, పరిపాలనా సంస్కరణల శాఖ, ఇంటెలిజెన్స్‌ శాఖ, సమాచార శాఖ, ఎవరికీ కేటాయించని ఇతర చిన్నచిన్న శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి.

ఇక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖలను కేటాయించారు. దాంతోపాటు బెంగళూరు నగర అభివృద్ధి శాఖను కూడా డీకేకు కట్టబెట్టారు. ఇక సీనియర్‌ నేతలు జీ పరమేశ్వరకు హోంశాఖ (ఇంటెలిజెన్స్‌ మినహా), హెచ్‌కే పాటిల్‌కు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, దినేశ్‌ గుండూరావుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కృష్ణ బైరె గౌడకు రెవెన్యూ శాఖ, ఎన్‌ చలువనారాయణస్వామికి వ్యవసాయ శాఖ, కేజే జార్జ్‌కు విద్యుత్‌ శాఖ, కేహెచ్ మునియప్పకు ఆహార, పౌరసరఫరాల శాఖ, ఎంబీ పాటిల్‌కు పరిశ్రమల శాఖను, రామలింగప్ప రెడ్డికి రవాణా శాఖ, ప్రియాంక్‌ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ, బీ నాగేంద్రకు యువజన వ్యవహారాలు, క్రీడా శాఖలను కేటాయించారు.

https://twitter.com/ANI/status/1662402897454432257