- ఇల్లు దెబ్బతిన్నోళ్లకు రూ.16,500
- గుడిసె కొట్టుకపోయినోళ్లకు రూ.18 వేలు
- మొత్తం బాధితుల కోసం రూ.25.33 కోట్లు ట్రాన్స్ఫర్
- రేపటిలోగా అందరికీ అందుతుందన్న అధికారులు
ఖమ్మం, వెలుగు: భారీ వర్షాలు, వరదల కారణంగా ఇండ్లు దెబ్బతిన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం పంపిణీ ప్రారంభించింది. తక్షణ సాయంగా ఒక్కో ఇంటికి రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించినప్పటికీ రూ.16,500 చొప్పున బాధితుల అకౌంట్లలో జమ చేస్తున్నది. ఖమ్మం జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వరద బాధితుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ ఫర్ అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 15,258 ఇండ్లు డ్యామేజీ అయ్యాయి. ఇందులో 12 ఇండ్లు పూర్తిగా కూలిపోగా, 15,096 పక్కా ఇండ్లు, మరో 150 గుడిసెలు డ్యామేజీ అయ్యాయని అధికారుల ఇంటింటి సర్వేలో లెక్కతేలింది. వీళ్లలో ఇండ్లు డ్యామేజీ అయిన వారికి రూ.16,500 చొప్పున, గుడిసెలు డ్యామేజీ అయిన వారికి రూ.18 వేల చొప్పున డబ్బులు జమ అవుతున్నాయి. మొత్తం బాధితుల కోసం రూ.25.33 కోట్లు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇంకా ఎవరైనా డబ్బులు జమ కానివాళ్లుంటే కంగారు పడొద్దని, గురువారంలోగా ప్రతి ఒక్క వరద బాధితుల అకౌంట్కు ప్రభుత్వ సాయం అందుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఖమ్మం నగరంలోనే డ్యామేజీ ఎక్కువ
ఖమ్మం నగరంలోని 13 డివిజన్లతోపాటు ఇతర మండలాల్లోని 20 గ్రామాల్లో వరద కారణంగా ఎక్కువ నష్టం జరిగింది. ప్రధానంగా ఖమ్మం నగరంలోనే 9,190 ఇండ్లు డ్యామేజీ కాగా, 88 గుడిసెలు దెబ్బతిన్నాయి. ఒక ఇల్లు పూర్తిగా కూలిపోయింది. తర్వాత ఖమ్మం రూరల్ మండలంలో 2,810 ఇండ్లు డ్యామేజీ కాగా, 5 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. మధిర మండలంలో 1,153 ఇండ్లు, ఎర్రుపాలెం మండలంలో 429, కూసుమంచి మండలంలో 424, ముదిగొండలో 225, నేలకొండపల్లిలో 197, తిరుమలాయపాలెంలో 191 ఇండ్లు డ్యామేజీ అయ్యాయి. ప్రస్తుతం ఇండ్ల రిపేర్ల కోసం, కొత్త బట్టలు కొనుక్కునేందుకు ప్రభుత్వం సాయం చేయగా, పూర్తిగా ఇండ్లు కూలిపోయిన12 మందికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 12 రోజులుగా చిన్న చిన్న ఖర్చులు, అవసరాల కోసం కూడా చేతుల్లో డబ్బుల్లేక ఇబ్బంది పడిన తమకు, ఇప్పుడు అందిన డబ్బులు ఆసరాగా నిలుస్తాయని బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం నగరంలోని మోతీనగర్ లో నివాసముండే ఒంటరి మహిళ రత్నకుమారికి జీవనాధారం ఏమీ లేదు. ఇద్దరు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయగా, ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తున్నది. మున్నేరు వరద ప్రభావంతో ఈ నెల ఒకటిన కాలనీ మొత్తం మునిగిపోయింది. దీంతో ఇంట్లోని ఎలక్ట్రికల్ సామన్లతోపాటు సర్వం కోల్పోయింది. వంట సామన్లు తప్ప ఏమీ మిగల్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె బ్యాంక్ అకౌంట్ లో బుధవారం రూ.16,500 జమయ్యాయి.
సంతోషంగా ఉంది
నేను పెద్ద మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకుంటా. వర్షాలు, భారీ వరద, బురద కారణంగా పది రోజుల నుంచి పనికి వెళ్లే పరిస్థితి లేదు. ఇంట్లో బురదలో నానిపోయిన సామన్లు క్లీన్ చేసుకుంటూ, ఇల్లు బాగుచేసుకుంటూ దా తలు అందించే అన్నం తింటున్నాం. ఇప్పుడు నెలజీతం పడినట్టుగా నా అకౌంట్లో డబ్బులు రావడం సంతోషంగా ఉంది. మా అమ్మాయి సర్టిఫికెట్లు కూడా వరదలో పాడైపోయాయని ఇక్కడికి వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పిన. ఇయ్యాల్నే సర్టిఫికెట్ల గురించి ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేసి పోయారు. అవి గూడా తొందర్లనే ఇప్పిస్తామని చెప్పారు. గండేటి అన్నపూర్ణ, కరుణగిరి, ఖమ్మం రూరల్
ప్రభుత్వ సాయం అందింది
నేను రూరల్ మండలంలోని ఓ గ్రానై ట్ కంపెనీలో పనిచేస్తున్నా. కరుణగిరి సమీపంలోని రాజీవ్ గృహకల్పలో 26వ బ్లాక్ లో నివాసం ఉంటున్నాం. మా కాలనీ మొత్తాన్ని వరద ముం చేయ గా..రెండ్రోజుల పాటు ఇంట్లో సామన్లన్నీ నీళ్లలోనే ఉండడంతో పాడైపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం డబ్బులు మంగళవారం బ్యాంక్ అకౌంట్లో జమయ్యాయి. పనికి పోలేని పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్నలాగా సాయం చేశాడు.
- ధరావత్ నీలా రమేశ్, రాజీవ్ గృహకల్ప