25 కిలోల హెరాయిన్​ మోసుకొస్తున్న డ్రోన్​ను కూల్చేసిన బీఎస్ఎఫ్

25 కిలోల హెరాయిన్​ మోసుకొస్తున్న డ్రోన్​ను కూల్చేసిన బీఎస్ఎఫ్

చండీగఢ్: పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి డ్రగ్స్ మోసుకు వస్తున్న ఓ డ్రోన్ ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కూల్చి వేసింది. పంజాబ్‌ ఫజిల్కా జిల్లాలోని చురివాలా చుస్తీ వీలేజ్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగగా.. ఆ ప్రాంతంలో జరిపిన సోదాల్లో 7.5 కిలోల బరువున్న తొమ్మిది హెరాయిన్ ప్యాకెట్లు, ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్లు, 9ఎంఎం 50 రౌండ్లు లభించాయని అధికారులు వెల్లడించారు. అదే ప్రాంతంలో దొరికిన ఓ షాలువాలో 17.5 కిలోల హెరాయిన్‌ ఉన్న మరో ఏడు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 25 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

డ్రోన్ కూలిన వెంటనే డ్రగ్స్ రికవరీ చేసేందుకు ముగ్గురు నలుగురు అనుమానితులు రావడాన్ని గుర్తించామని చెప్పారు. వారిపై బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు కూడా జరపగా..తప్పించుకుని పారిపోయారని అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి కూడా పంజాబ్ లోని తర్న్ తరన్ జిల్లాలోని బార్డర్ వద్ద ఉన్న పొలంలో ఓ డ్రోన్ తో పాటు 5 కిలోలకు పైగా హెరాయిన్‌ దొరికిందని పోలీసులు పేర్కొన్నారు.