పేపర్ కప్పులతో టీ, కాఫీ తాగితే ప్రమాదం!

పేపర్ కప్పులతో టీ, కాఫీ తాగితే ప్రమాదం!
  •     ఐఐటీ ఖరగ్​పూర్​ సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి

న్యూఢిల్లీ :మనలో చాలా మంది రిఫ్రెష్ మెంట్ కోసం అప్పుడప్పుడూ టీ, కాఫీ తాగుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో ప్లాస్టిక్  కప్పులకు బదులుగా పేపర్  కప్పులు వాడుతున్నారు. ఈ పేపర్  కప్పులతోనూ ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని, వాటిలో పోసిన వేడివేడి టీ, కాఫీ తాగితే క్యాన్సర్  బారినపడే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. పేపర్  కప్పులో కంటికి కనిపించని 25 వేల మైక్రోప్లాస్టిక్  కణాలు ఉంటాయని, ఆ కణాలు మన బాడీలోకి ఎంటరైతే క్యాన్సర్  వచ్చే ముప్పు ఉందని ఇండియన్  ఇన్ స్టిట్యూట్  ఆఫ్  టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్ పూర్  రిసర్చర్లు పేర్కొంటున్నారు. పేపర్ కప్పులు పనికిరాని వస్తువులు మాత్రమే కాదని, అవి ఆరోగ్యానికి చేటని చెప్తున్నారు. ఇందుకోసం వారు ఓ ప్రయోగం చేసి చూశారు. 100 ఎంఎల్  పేపర్  కప్పులో వేడి నీళ్లు పోసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచారు. ఆ తర్వాత ఆ నీటిని పవర్ ఫుల్  మైక్రోస్కోపుతో పరిశీలించగా.. అందులో కంటికి కనిపించని సగటున 25 వేల మైక్రోప్లాస్టిక్  కణాలు చేరినట్లు గుర్తించారు. జింక్, లెడ్, క్రోమియం వంటి మెటల్స్‌‌‌‌ పేపర్  కప్పులో నుంచి ఆ నీటిలో విడుదలైనట్లు కనుగొన్నామని రిసర్చర్లు తెలిపారు.

కప్పుల తయారీలో హానికారక రసాయనాలు

‘‘ఈరోజుల్లో ఓ వ్యక్తి సగటున రోజుకు రెండు లేదా మూడుసార్లు పేపర్  కప్పులో టీ, కాఫీ తాగుతున్నాడు. ఒక కప్పుతో ఒకసారి వేడివేడి టీ, కాఫీ తాగితే అందులో 25 వేల మైక్రోప్లాస్టిక్స్  కణాలు చేరుతున్నట్లు మా పరిశోధనలో తేలింది. అంటే ఒక వ్యక్తి అలా మూడుసార్లు తాగితే అతని శరీరంలో 75 వేల హానికారక మైక్రోప్లాస్టిక్స్‌‌‌‌  కణాలు ప్రవేశిస్తున్నట్లు లెక్క. మన కంటికి కనిపించని ఆ మైక్రోప్లాస్టిక్  కణాలు బాడీలో ఎంటరైతే క్యాన్సర్  ముప్పు తప్పదు. పేపర్  కప్పు అలవాటును ఎట్టిపరిస్థితుల్లోనైనా మానుకోవాలి. ఆ కప్పుల తయారీలో హానికారక రసాయనాలు వాడుతుంటారు” అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన, ఐఐటీ ఖరగ్ పూర్  సైంటిస్ట్  డాక్టర్ సుధా గోయల్  వెల్లడించారు. ఒక మైక్రాన్  సైజులో ఈ ప్లాస్టిక్  కణాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ కణం కన్నా మన వెంట్రుక వెడల్పు  25 రెట్లు ఎక్కువన్నారు. అయాన్లు, పల్లాడియం, క్రోమియం, క్యాడ్మియం వంటి కంటామినెంట్లకు మైక్రోప్లాస్టిక్స్  క్యారియర్లుగా పనిచేస్తాయని,  పేపర్  కప్పుల ద్వారా అవి మన శరీరంలోకి పోతే, ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని సుధా గోయల్  వివరించారు. పేపర్  కప్పులను రీసైకిల్  చేయడం కూడా కష్టమన్నారు. కాగా, ఐఐటీ ఖరగ్ పూర్  సైంటిస్టులు చేసిన రిసర్చ్ జర్నల్  ఆఫ్​ హజార్డస్  మెటీరియల్స్ లో ప్రచురితమైంది.

విదేశాల్లో హానికరం కాని పేపర్  కప్పులు

మన దేశంలో తయారయ్యే పేపర్  కప్పులు హానికరమైనవని ఎక్స్ పర్టులు చెబుతున్నారు. అయితే యూకే, యూరోపియన్  యూనియన్  దేశాల్లో తయారయ్యే పేపర్  కప్పులను అక్కడి ప్రజల హెల్త్ ను దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తున్నారని, ఆరోగ్య ప్రమాణాలను పాటిస్తున్నారని తెలిపారు. కస్టమర్ల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ వాటిని తయారు చేస్తున్నారని, హైజీన్ ను పాటిస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా వాటిని రీసైకిల్  చేసేలా ఉత్పత్తి చేస్తున్నారన్నారు.