
హైదరాబాద్: పేదల పేరుతో పెద్దలు చేస్తున్న భూ కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్నియోజకవర్గం గాజుల రామారంలోని ప్రభుత్వ భూమిలో వెలిసిన ఆక్రమణలను కూల్చివేసింది. సర్వే నెంబర్ 307లో స్టేట్ఫైనాన్స్కార్పొరేషన్కు కేటాయించిన సుమారు 300 ఎకరాల స్థలంలో పేదల పేరుతో కొందరు కబ్జాదారులు, ప్రజాప్రతినిధులు.. వందల సంఖ్యలో లే అవుట్లు వేసి షెడ్లు వేయడంతోపాటు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇదే సర్వే నంబర్ చుట్టూ కబ్జాలు జరగగా.. ప్రగతినగర్ వైపు ఏకంగా లే అవుట్లు, వెంచర్లు వేశారు. ఈ క్రమంలో కొద్ది రోజుల కింద సర్వే నెంబర్307లో సుమారు రూ.15 వేల కోట్ల విలువ చేసే 300 ఎకరాలు కబ్జాకు గురైందని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి.
దీంతో మేడ్చల్కలెక్టర్ మనుచౌదరిశనివారం ఫీల్డ్ లెవెల్‌లో పర్యటించి, ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది నిజమేనని తేల్చారు. 60 నుంచి120 గజాల ప్లాట్లను చేసి నిరుపేదలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆదివారం ఉదయం నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా రంగంలోకి దిగి.. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మొదలుపెట్టింది. 12 ఎకరాల్లో వెలిసిన వెంచర్‌తో పాటు 20 ఎకరాల మేర ఉన్న లే అవుట్‌ను తొలగించింది. ఇందులో టెంపరరీగా బడాబాబులు వేసిన షెడ్లు, ప్రహరీలు ఉన్నాయి. ఈ భూముల్లో రోడ్లు వేసుకోవడమే కాకుండా, కరెంటు కనెక్షన్లు కూడా తీసుకున్నారు. కాగా, ఆక్రమణలు తొలగించిన హైడ్రా ఈ స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయడం స్టార్ట్‌చేసింది.
2023లో 2,500 అక్రమ నిర్మాణాలు
2023లో 2,500 అక్రమ నిర్మాణాలు వెలిశాయని అప్పటి కలెక్టర్అమోయ్ కుమార్ తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి అప్పటి ఆర్ఐని సస్పెండ్కూడా చేశారు. అయితే, తర్వాత అక్రమ నిర్మాణాలపై యాక్షన్తీసుకోకపోవడంతో ఇండ్లు, షెడ్లు వెలుస్తూనే ఉన్నాయి. అప్పటి ప్రజాప్రతినిధి కబ్జాదారులకు అండగా నిలిచినట్టు ఆరోపణలున్నాయి. ఇక్కడ నిర్వహించే పలు కార్యక్రమాలకు కూడా వారు హాజరయ్యేవారని, దీంతో కబ్జాదారుల ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు అక్కడ 5వేల వరకు అక్రమ నిర్మాణాలు వెలిశాయని తెలుస్తున్నది.
పేదల పేరుతో కబ్జాదారుల డ్రామా
పదేండ్ల కింద గత బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో పేదల పేరుతో ప్రజాప్రతినిధులు, కబ్జాదారులు కుమ్మక్కై రియల్‌ఎస్టేట్‌వ్యాపారం మొదలుపెట్టారని కూల్చివేతల టైంలో అక్కడికి వచ్చిన పలువురు స్థానికులు ఆరోపించారు. ఈ సందర్భంగా కొందరు బాధితులు రూ.20 లక్షలకు కొన్నామని చెప్తున్నారని, అమ్మిన వారి పేరు చెప్పాలని అడిగితే మాట్లాడడం లేదన్నారు.
దీన్ని బట్టి అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. మరికొందరు తాము కొనలేదని, ప్రభుత్వ భూమి అని రూమ్స్వేసుకున్నామని చెప్తున్నారని, ఇదంతా చూస్తుంటే కొందరు వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని అర్థమవుతున్నదన్నారు. కబ్జాదారులు పేదలను ముందు పెట్టి పకడ్బందీ ప్లాన్‌తో రూ.వేల కోట్ల విలువచేసే భూములను కబ్జా చేశారని, వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్చేస్తున్నారు.