
- సిద్దిపేట జిల్లాలో 2.55 లక్షల మెట్రిక్ టన్నులు అప్పగించాల్సిన మిల్లర్లు
- తనిఖీలు కొనసాగుతున్నా ఖాతర్ చేయట్లే
- సివిల్ సప్లయ్ అధికారుల అండతోనే సీఎంఆర్ పక్కదారి పట్టిందన్న ఆరోపణలు
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లాలోని మిల్లర్లకు ఇచ్చిన గడువు ముగిసి నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు టార్గెట్ పూర్తి చేయలేదు. ఇంకా 2లక్షల55వేల289 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉన్నా మిల్లర్లలో స్పందన లేదు. జిల్లాలోని మిల్లుల్లో సంబంధిత అధికారులు తనిఖీలు చేస్తున్నా.. ఎలాంటి లెక్కలు బయటికి చెప్పడం లేదు. ఇప్పటికే సీఎంఆర్ కోసం కేటాయించిన వడ్లను మరాడించి, మిల్లర్లు పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఆ లోటును భర్తీ చేసేందుకు రేషన్‌బియ్యాన్ని పాలిష్‌పట్టి మమా అని పెంచే ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. వాస్తవంగా అయితే, మిల్లులకు కేటాయించిన వడ్లను 45 నుంచి 60 రోజుల్లో మరాడించి, సీఎంఆర్అందించాలి. అయితే బియ్యం అప్పగించడంలో మిల్లర్లు జాప్యం చేస్తూ వస్తున్నారు.
డిసెంబర్31వ తేదీతో మూడోసారి ఇచ్చిన గడువు కూడా ముగిసింది. కానీ నేటికీ సీఎంఆర్టార్గెట్ను పూర్తిచేయలేదు. ఇప్పటి వరకు 81.48 శాతం సీఎంఆర్‌ను మాత్రమే అందించారు. సిద్దిపేట జిల్లాలో వానాకాలం(2022–-23) సీజన్‌లో 3,62,193 టన్నుల వడ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం, సీఎంఆర్ కింద 144 రైస్ మిల్లుకు కేటాయించింది. అందులో బాయిల్ అయితే 68 శాతం, రా రైస్ అయితే 67 శాతం బియ్యంగా మార్చి తిరిగి పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. మొత్తంగా 2,43,850 టన్నుల బియ్యం అందించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,98,679 టన్నుల బియ్యం మాత్రమే అందించారు.
ఇంకా 45,171 టన్నులు పెండింగ్ఉంది. అలాగే యాసంగిలో 3,52,417 టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసి, 82 మిల్లులకు అప్పగించింది. 2,47,557 టన్నుల బియ్యం అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు మిల్లర్లు 37,439 టన్నుల బియ్యం మాత్రమే అందించారు. ఇంకా 2,10,118 టన్నుల బియ్యం మిల్లర్లు అప్పగించాల్సి ఉంది.
అప్పుడు చర్యలు తీసుకోకపోవడంతోనే..
రైతులకు మద్దతు ధర ఇచ్చి సర్కారు కొంటున్న వడ్లను మిల్లర్లు అక్రమంగా అమ్ముకుంటున్నారు. సివిల్సప్లయ్ఆఫీసర్ల అండతో బియ్యాన్ని ఎగ్గొడుతున్నారు. గతేడాది హుస్నాబాద్‌లోని ఏఆర్ఎం ఆగ్రోస్ఇండస్ట్రీస్ యజమాని 9,523 టన్నుల వడ్లను మాయం చేసినట్టు తేలినా ఇప్పటి వరకు రికవరీ చేయలేదు. దీనిని అలుసుగా తీసుకున్న ఇతర మిల్లర్లు, సీఎంఆర్ కింద తీసుకున్న వడ్లను, బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. ఏఆర్ఎం మిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం 2021లో వానాకాలం, యాసంగి సీజన్‌కు 11,427 టన్నుల వడ్లను కేటాయించింది.
అయితే 2 వేల టన్నుల వడ్లను మాత్రమే బియ్యంగా మరాడించి సీఎంఆర్ కింద పౌర సరఫరాల సంస్థకు అప్పగించింది. మిగితా 9,523 టన్నుల వడ్లను బియ్యంగా చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్టు తేలింది. దీని విలువ రూ.27.76కోట్లు ఉంటుందని అంచనా. ఇంతవరకు ఆ బియ్యాన్ని రికవరీ చేయలేదు. ప్రస్తుతం సీఎంఆర్షార్టేజ్ ఉన్న మిల్లర్లంతా రేషన్ బియ్యాన్ని పాలిష్‌చేసి చూపిస్తున్నారు. ఇందుకోసం గ్రామాలు, మండల కేంద్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వ్యాపారం సాగిస్తున్నారు. రేషన్‌బియ్యాన్ని పాలిష్ చేసి ఎఫ్‌సీఐ, స్టేట్ పూల్‌కు అప్పగిస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నా మిల్లర్లు బేఖాతరు చేయట్లేదు.
స్టాక్ లేకున్నా.. ఉన్నట్టే..
రైతుల నుంచి తీసుకుంటున్న వడ్లను మిల్లర్లు మరాడించకుండా తమ వద్దే ఉంచుకుంటున్నారు. ధర పెరిగేదాకా ఉంచుకొని డిమాండ్వచ్చాక ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా మోసం చేయడమేకాకుండా మిల్లుల్లో స్టాకు లేకున్నా ఉన్నట్టు చూపిస్తున్నారు. అక్రమాన్ని బయటకు రాకుండా రెవెన్యూ, సివిల్‌సప్లయ్, విజిలెన్స్‌అధికారులకు మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో స్టాకు వివరాలు చెప్పకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని చీట్చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మిల్లుల్లో తనిఖీలు చేస్తే వాస్తవాలు బయటపడతాయి.