షాంఘై సదస్సుతో ప్రపంచశాంతికి బాటలు

షాంఘై సదస్సుతో ప్రపంచశాంతికి బాటలు

ప్రపంచ రాజకీయాలలో నూతన అధ్యాయం మొదలవుతున్న దృశ్యం ఆవిష్కృతమవుతోంది. అవసరం సృష్టించిన అనివార్యతతో, శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి వలనో భారత్,  చైనా, రష్యాలు  స్నేహబంధాన్ని పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనికి వేదికగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1న  చైనా నగరం తియాంజిన్ నగరంలో జరిగిన 25వ షాంఘై సహకార సదస్సు నిలిచింది.  ‘ఉమ్మడి భవిష్యత్ కోసం షాంఘై సమూహం’ అనే ఇతివృత్తంగా జరిగిన ఈ సదస్సు పలు కీలక మార్పులకు సాక్షిగా నిలిచింది. భారత్​ను ఉద్దేశించి మేం శత్రువులం కాదు భాగస్వాములం అని చైనా అధ్యక్షుడు ప్రకటించాడు. డ్రాగన్, ఎలిఫెంట్​ల పరస్పర సహకారం మరింత బలోపేతం కానుంది.

సేవా రంగంలో భారత్, నిర్మాణ ఉత్పత్తి లో  చైనా, శక్తి వనరులలో  రష్యాలకు ఉన్న అనుకూలతల సమన్వయం చేసుకుని వికాసదిశగా పయనించే అపూర్వ అవకాశం ఉందని ఈ సదస్సు అభిప్రాయపడింది.  భారత్,  చైనా దేశాలు వేలాది సంవత్సరాలుగా చక్కటి సంబంధాలు కలిగి ఉన్న రెండు అతి పెద్ద పొరుగు దేశాలు.  బ్రిటిష్  సామ్రాజ్యవాద వ్యతిరేక,  జాతీయోద్యమ వెల్లువల కాలంలో సహకరించుకున్న దేశాలు.  అంతర్జాతీయ మానవతకు, మానవీయ సంస్కృతిని రూపుదిద్దుకున్న దేశాలు.  జనాభా రీత్యా కూడా మొదటి, రెండు స్థానాలలో ఉన్న ఈ  రెండు దేశాల మధ్య స్నేహం మానవాళిలో అత్యధిక మధ్య వెల్లివిరిసే సౌభ్రాతృత్వానికి చిహ్నంగా ఉంటుంది. ఈ స్నేహం రెండు దేశాల మధ్య శాంతికి, ఆసియా ఖండంలో శాంతికి,  తద్వారా  ప్రపంచశాంతికి బాటలు వేస్తుంది.  

ప్రపంచ రాజకీయ సమీకరణలో ముందడుగు

అమెరికా ఆధారిత ఏక ధ్రువ ప్రపంచం స్థానంలో బహుళ ధ్రువ ప్రపంచం వైపు కృషి చేయాలనే లక్ష్యంతో 2001లో పూర్వ సోవియట్ యూనియన్ దేశాలలో కొన్ని దేశాలు, చైనా కలసి 2001లో షాంఘై సహకార సంస్థ (ఎస్ సిఓ) ఏర్పడింది.  చైనా,  రష్యా,  తజకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్​లు  వ్యవస్థాపక  సభ్య దేశాలు. ఈ సంస్థలో  భారత్  చాలాకాలం పాటు పరిశీలక సభ్యదేశంగా ఉంది.  2017లో భారత్​, పాకిస్థాన్, ఇరాన్  కూడా పూర్తిస్థాయి  సభ్యదేశాలుగా మారాయి.  తియాన్​జిన్​లో జరిగిన ఎస్ సిఓ సమావేశం ప్రపంచ రాజకీయ సమీకరణలో గొప్ప ముందడుగుకు  దోహదం చేస్తుంది.  భారత్,  చైనా, రష్యా దేశాలు పరస్పరం సహకరించుకుంటే ఉత్పత్తి,  వాణిజ్యం, సాంకేతిక రంగాలలో ప్రపంచ అగ్రగామి దేశాలుగా రూపాంతరం చెందుతాయని గోల్డ్ మాన్ సాక్స్ అనే ఆర్థిక సంస్థ పాతికేళ్ల క్రితమే ఒక నివేదికను వెలువరించింది.   షాంఘై సహకార సంస్థ, అలాగే బ్రెజిల్, రష్యా,  ఇండియా,  చైనా,  సౌత్ ఆఫ్రికాలతో  బ్రిక్స్ అనే కూటమిలు ఏర్పడ్డాయి.  ప్రపంచ ఆర్థికక్రమంపై ఆధిపత్యం ఉన్న ఉత్తర అమెరికా,  యూరప్ లతో కూడిన గ్లోబల్ నార్త్ కు ప్రత్యామ్నాయంగా ఆసియా,  ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో ఉన్న  గ్లోబల్ సౌత్  దేశాలు ఎదగాలని ఎస్ సిఓ,  బ్రిక్స్ సంస్థలు ఏర్పడ్డాయి. 

ట్రంప్​కు మోదీ ప్రచారం

2014లో  మోదీ సారథ్యంలో  బీజేపీ అధికారం చేపట్టాక ఈ సంస్థల కార్యక్రమాలలో నామమాత్ర భాగస్వామ్యం ప్రదర్శించింది. ఈ రెండు సంస్థల స్ఫూర్తికి విరుద్ధంగా  ఏక ధ్రువ ప్రపంచం తన అధీనంలో ఉండాలనే అమెరికాకు స్నేహ హస్తం అందించింది. ప్రబల ఆర్థిక, సైనిక శక్తిగా ముందుకువస్తున్న  చైనాను అడ్డుకోవడానికి అమెరికా నేతృత్వ క్వాడ్ కూటమిలో జపాన్, ఆస్ట్రేలియాలతో జతకట్టింది.  2020 లో హౌడీ మోదీ పేరుతో అమెరికాలో ట్రంప్ ఎన్నికల  ప్రచారంలో మోదీ పాల్గొన్నారు.  నెహ్రూ అలీన విధానాన్ని విస్మరించి  విస్తరణవాద.  

సామ్రాజ్యవాద  అమెరికాతో భారత్ బంధం తీవ్రంగా పెనవేసుకోవడం చైనాకు ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికా తన ప్రాక్సీ ఇజ్రాయెల్ మధ్య ప్రాచ్యంలో కొనసాగిస్తున్న దాడుల పట్ల,  జన హననం పట్ల మౌనంగా ఉంది.  భారత్​లో  కాంగ్రెస్  ప్రభుత్వాలు  ఏనాడూ  అమెరికాకు దాసోహం అనలేదు, ఆత్మగౌరవంను తాకట్టు పెట్టలేదు. అది పోఖ్రాన్ అణు పరీక్షలలో, 1971 ఇండో–పాక్ యుద్ధంలో నిరూపితం అయ్యింది. బీజేపీ హయాంలో మాత్రం అమెరికా అనుకూలతను, శతాబ్దాల సాంస్కృతిక చారిత్రక బంధాలను కలిగి ఉన్న చైనా పట్ల ప్రతికూలతను ఆచరించింది.

భారత్​పై ట్రంప్​ కన్నెర్ర

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ, ట్రంప్  గాఢబంధం బీటలువారడం  ప్రారంభమయింది. భారత్  ఎగుమతులపై  50 %  సుంకాలు విధించి మన ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నాడు.  పహల్గాం నేపథ్య  భారత్, పాక్ గొడవల  ముగింపులో  భారత ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేశాడు. రష్యా తిరిగి ప్రబల వ్యాపార సైనిక శక్తిగా మారడానికి భారత్ సహకరిస్తుందని, దీనికి ప్రతీకార సుంకాలు వేసినట్టు చెప్పాడు. రష్యా ముడి చమురు దిగుమతి చేసుకుని, శుద్ధి చేసి ఇతర దేశాలకు ఎగుమతితో రష్యాకు క్లియరింగ్ హౌస్ లాగ పని చేస్తుందని,  రష్యాను ఆర్థికంగా ఒంటరి చేసే ప్రయత్నాలకు భారత్ అడ్డంకిగా మారిందని, అది ఉక్రేనియా యుద్ధానికి దారి తీసిందని  ట్రంప్ గుర్రుగా ఉన్నాడు.  భారత్​ను ఆర్థిక దిగ్బంధం చేసే ప్రయత్నాలను ఏమాత్రం కనికరం లేకుండా ట్రంప్  తీవ్రం చేశాడు. ఇలాంటి అనివార్యతలో తోటి  పొరుగు దేశం చైనాతో భాగస్వామిగా ఉన్న బ్రిక్స్, ఎస్ సిఓ వైపు  మోదీ దృష్టి  పెట్టాడు.

సరిహద్దుల సమస్యలు సంయమనంతో పరిష్కరించుకోవాలి

వలస పాలకులు సృష్టించిన సరిహద్దుల సమస్యలు సంయమనంతో పరిష్కరించుకోవాలి.  3,400 కిలోమీటర్ల ఉమ్మడి సరిహద్దు గల  ఇరు దేశాలు పరస్పర నమ్మకం, విజ్ఞత,  వివేకంతో వ్యవహరిస్తే ఉద్రిక్తతలు తొలగిపోతాయి. ఇది రక్షణ వ్యయం తగ్గటానికి,  ఇతర మానవ వనరుల అభివృద్ధి కోసం గరిష్టంగా పని చేసుకోవడానికి వీలవుతుంది.  ఎస్​సిఓ సదస్సులో  చైనా స్నేహ హస్తాన్ని స్వీకరిస్తూ  మరింత వికాసం కోసం చైనాతో పటిష్ట  వ్యాపార  సహకార సంబంధాలను కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోదీ  ప్రకటించాడు.  చైనా అధ్యక్ష్డుడు జింగ్ పింగ్ మాట్లాడుతూ 1.4 బిలియన్ల డాలర్లతో అభివృద్ధి బ్యాంక్​ను ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు.  కవ్వించే చర్యలతో  ప్రచ్ఛన్న యుద్ధాలకు  తెరతీస్తున్న పాశ్చాత్య దేశాల ధోరణులను సమష్టిగా ఎదుర్కోవాలి.  బహుళ ధ్రువ ప్రపంచం, బహుళ ధ్రువ ఆసియా ఏర్పాటు ప్రక్రియలో భారత్ తన విదేశాంగ విధానాన్ని  స్పష్టంగా ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని, తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించే చారిత్రక అవకాశాన్ని  ఎస్​సిఓ సదస్సు ఇచ్చింది.   

చైనా పెట్టుబడులకు ఆహ్వానం పలకాలి

2020లో గల్వాన్ లో భారత్ – చైనా దేశాల మధ్య సైనిక గొడవలు తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. ఈ అగాధంను  తగ్గించడానికి  రష్యా మధ్యవర్తిత్వంతో  కొంత రాజీ కుదిరింది.  యురేషియా ప్రాంతానికి చెందిన ఈ మూడు దేశాల ఐక్యత,  సహకారం  గ్లోబల్ సౌత్ వికాసానికి దోహదం చేస్తుంది. భారత్,  చైనా దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంలో ఉన్నాయి.  బ్రిక్స్, ఎస్​సీఓలో సభ్య దేశాలుగా ఉన్నాయి.  చైనా 19.23 ట్రిలియన్ల  డాలర్ల జీడీపీతో రెండవ స్థానాన్ని,  భారత్ 4.18 ట్రిలియన్ల డాలర్ల జీడీపీతో 4వ స్థానాన్ని కలిగి ఉన్నాయి.  చైనా ‘బెల్ట్’ ప్రక్రియతో ఉపరితల రవాణా ద్వారా ఆసియా దేశాలకు,  రోడ్ ప్రక్రియ ద్వారా,  సముద్ర జలాల ద్వారా ఆగ్నేయ ఆసియా దేశాలకు ద్వారాలను తెరిచింది.  ప్రపంచీకరణ దశను ముందస్తుగానే గుర్తించి ఆసియాలో అందరికంటే ఆసియా యూరప్ ఇండో పసిఫిక్ దేశాలతో  చైనా  వాణిజ్య బంధం  ఏర్పాటు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాలు ఐక్యత, సహకారంతో అభివృద్ధి చెందగలవు. పెండింగ్​లో పెట్టిన చైనా పెట్టుబడులకు ఆహ్వానం పలకాలి.  పునరుత్పాదక ఇంధనం,  ఎలక్ట్రానిక్స్,  నిర్మాణ, విద్య, సాంకేతిక రంగాల వికాసం కోసం చైనా సహకారం తీసుకోవాలి.

- అస్నాల శ్రీనివాస్ 
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం