
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దుమ్ము తుఫాను బీభత్సం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి పెద్ద మెరుపులతో కూడిన దుమ్ము తుఫాను సంభవించింది. తుఫాను దాటికి 26 మంది చనిపోగా.. మరో 57 మంది గాయపడ్డారు. పెద్ద చెట్లు, ఇళ్ల గోడలు కూలిపోయాయని యూపీ రిలీఫ్ కమిషనర్ చెప్పారు. ఇళ్ల గోడలు కూలిన ఘటనలో చాలా మంది చనిపోయారన్నారు. మెయిన్‌పురిలో ఆరుగురు, ఇతాలో ముగ్గురు, కస్‌గంజ్‌లో ముగ్గురు, మొరాదాబాద్, బదాయూ, పిలిభిత్, మధుర, కనౌజ్, సాంభల్, ఘజియాబాద్‌లో ఒక్కొక్కరు చనిపోయారని అధికారులు చెప్పారు. మెయిన్‌పురిలో 41 మంది గాయపడ్డారని, వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.