26/11 ముంబై ఉగ్రదాడులకు 15ఏళ్లు.. చెరగని మచ్చలుగా మిగిలిన గుర్తులు

26/11 ముంబై ఉగ్రదాడులకు 15ఏళ్లు.. చెరగని మచ్చలుగా మిగిలిన గుర్తులు

నవంబర్ 26, 2008.. అనగానే భారతదేశంలో గుర్తొచ్చే రోజు ముంబైలో ఉగ్రవాద దాడులే. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన హృదయ విదారకమైన.. ఉగ్రవాద దాడులు చేసిన ఘోరమైన దాడిని దేశ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. నవంబర్ 26నాటికి ఈ దాడి జరిగి 15 సంవత్సరాలవుతున్న క్రమంలో మరోసారి ఈ ఘటనను దేశం గుర్తుకు తెచ్చుకుంటోంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం 10 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు ఈ రోజున ముంబయి వీధుల్లో అల్లకల్లోలం సృష్టించారు. ఇది ప్రపంచాన్ని సైతం షాక్‌కు గురి చేసింది. దేశంలో తీవ్ర ఆందోళనలకు గురి చేసిన ఈ దాడి నవంబర్ 26, 2008 రాత్రి ముంబైలో చోటుచేసుకుంది. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు నాలుగు రోజుల వ్యవధిలోనే 166 మందిని చంపారు. ఈ దాడిలో అనేకమంది గాయపడ్డారు కూడా..

ముంబై CST వద్ద అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు రైల్వే అధికారులు కూడా మరణించారు. అనంతరం ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లో మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్‌ను ముంబై పోలీసులు పట్టుకోగా, 10 మంది లష్కరేటర్ ఉగ్రవాదుల్లో తొమ్మిది మందిని హతమార్చారు. తుకారాం ఓంబ్లే.. కసబ్‌ను పట్టుకున్నారు. అతని ధైర్యసాహసానికి మరణానంతరం అతనికి అశోక్ చక్రను ప్రదానం చేశారు. ఈ దాడిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌తో సహా ఇద్దరు ఎన్‌ఎస్‌జి కమాండోలతో సహా చాలా మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

ఆపరేషన్ సమయంలో ఎలైట్ కమాండో ఫోర్స్‌కు నేతృత్వం వహించిన అప్పటి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) చీఫ్ జ్యోతి క్రిషన్ దత్, తన బంధువుల్లో ఒకరిని ఉగ్రవాదులు చంపారని తెలిసినా.. తన డ్యూటీని కొనసాగించారనేది చాలా మందికి తెలియని వాస్తవం. అనంతరం విచారణలో తాను పాకిస్థానీ పౌరుడినని, LeTm సభ్యుడినని ఒప్పుకున్న కసబ్‌కు మరణశిక్ష విధించారు. రెండు సంవత్సరాల తరువాత పూణే నగరంలోని భారీ భద్రత నడుమ గల జైలులో ఉరి తీశారు.

ముంబయి ఉగ్రదాడులు మిగిల్చిన గుర్తులు హోటల్‌లో, చుట్టుపక్కల, ముంబై నగరంలోని చాలా చోట్ల ఇప్పటికీ.. అప్పడు భయంకరంగా గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇక ఉగ్రదాడుల 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇజ్రాయెల్ అధికారికంగా లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. భారత ప్రభుత్వం ఎలాంటి అభ్యర్థన లేకుండానే ఈ చర్య తీసుకోవడం చెప్పుకోదగిన విషయం. ఎల్‌ఈటీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.