ఈ ఉద్యమానికి 27 ఏండ్లు 

ఈ ఉద్యమానికి 27 ఏండ్లు 

మన చుట్టు పక్కల ప్రతి రోజూ ఏదో ఒక రకమైన తప్పు జరుగుతూనే ఉంటుంది. ఆ తప్పులకు ఎందరో అమాయకులు బలవుతుంటారు. ఈ మధ్య కాలంలో తప్పు అనేది జనాలకు చాలా సాధారణమైన విషయం అయిపోయింది. అందుకే వాటి మీద రియాక్ట్​ అయ్యేవాళ్లు కూడా తక్కువే. కానీ.. ఈ బడిపంతులు మాత్రం అలా కాదు. కళ్ల ముందు జరిగిన అన్యాయాన్ని నిలదీశాడు. అహింసా మార్గంలోనే ఆ అన్యాయం మీద పోరాడుతున్నాడు. ఒకటి లేదా రెండు నెలలు కాదు.. ఏకంగా ​ 27 ఏండ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు. 


విజయ్​ సింగ్ ఒకప్పుడు ఉత్తరప్రదేశ్​లో పిల్లలకు పాఠాలు చెప్తూ సామాన్యంగా బతికే బడి పంతులు​. స్కూలు, పిల్లలు, ఇల్లే అతని ప్రపంచం. అలాంటిది అన్నింటినీ వదిలిపెట్టి, తన జీవితాన్ని త్యాగం చేసి 33 ఏండ్ల వయసులో ఒక భూ కబ్జా మాఫియాకు ఎదురు నిలిచాడు. 27 ఏండ్లుగా పోరాటం చేస్తున్నాడు. ఆయనది ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని చౌసానా గ్రామం. మీరట్‌‌‌‌‌‌‌‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్​ పట్టా పొందాడు. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. టీచర్​ ఉద్యోగంలో చేరాడు. ఆయన ఒక రోజు ఊళ్లో నుంచి స్కూలుకు వెళ్తుంటే.. ఆకలితో బాధ పడుతున్న ఒక పిల్లాడు కనిపించాడు. ఆ పిల్లాడు తినడానికి రొట్టెలు కావాలని వాళ్ల అమ్మని అడుగుతున్నాడు. కానీ.. వాళ్లమ్మ ‘ఇంట్లో పిండి లేద’ని చెప్తోంది. ఇదంతా చూసిన విజయ్​ వాళ్ల పేదరికానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచించాడు. మరుసటి రోజు నుంచే ఆ ఊళ్లో ఉన్న రిసోర్స్​(వనరుల) మీద రీసెర్చ్​ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి తెలిసింది ఏంటంటే.. వాళ్ల ఊళ్లో ఉన్న 4,000 బిఘాల(బిఘా అనేది కొన్ని ప్రాంతాల్లో భూమిని కొలవడానికి వాడే కొలమానం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్టాండర్డ్​ సైజ్​ ఉంటుంది. నార్త్​ ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్​, నేపాల్​లో భూమిని బిఘాల్లో కొలుస్తారు.) భూమిని కొంతమంది రాజకీయ నాయకులు అక్రమంగా ఆక్రమించుకున్నారని తెలిసింది. వాస్తవానికి అలాంటి భూముల్లో పేదవాళ్లు వ్యవసాయం చేసుకుంటారు. ఆ భూమిని విడిపించి, పేదలకు ఇప్పించాలని నిర్ణయించుకున్నాడు. 


పోరాటం మొదలు


పేదల కోసం ఎంతకైనా తెగించాలి అనుకున్నాడు. అందుకే ఉద్యోగం, కుటుంబాన్ని కూడా లెక్క చేయలేదు. తన టీచర్​ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తర్వాత సంబంధిత అధికారులకు ఆక్రమణలపై ఎంక్వైరీ చేయాలని రిక్వెస్ట్​లు పెట్టాడు. ఉత్తరప్రదేశ్​ గవర్నమెంట్1995లో ఆక్రమణలపై విచారణ జరిపేందుకు డివిజన్ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు బాధ్యతలు అప్పగించింది. దాంతో అతని నాయకత్వంలో  కొంతమంది ఆఫీసర్ల టీం దీనిపై ఎంక్వైరీ చేసింది. అంతేకాదు.. కొందరు భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని తేల్చి చెప్పింది. విజయ్​ చేసిన ఆరోపణలన్నీ నిజమేనని గవర్నమెంట్​కు నివేదిక ఇచ్చింది. కానీ.. అధికారులు ఈ ఆక్రమణలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆ భూమిని కూడా తిరిగి స్వాధీనపరుచుకోలేదు. దాంతో విసిగిపోయిన విజయ్​ సింగ్​ 1996 ఫిబ్రవరి 26న ముజఫర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని జిల్లా మేజిస్ట్రేట్ ఆఫీస్​ ముందు నిరసన మొదలుపెట్టాడు. ఆ భూమిని పేదలకు ఇప్పించాలనే డిమాండ్​తో 27 ఏండ్ల నుంచి ధర్నా చేస్తూనే ఉన్నాడు.


136 కేసులు


గురించి తెలిసిన అప్పటి హోంశాఖ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ 2008లో ఈ ఆక్రమణలపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించాడు. అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ ఆర్. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో కొందరు ఆఫీసర్లు చౌసానా గ్రామానికి వెళ్లి  అక్రమంగా ఆక్రమించుకున్న 300 బిఘాల భూమిని విడిపించారు.ఈ భూమిని ఆక్రమించుకున్న వాళ్లపై136 కేసులు పెట్టారు. అయితే.. మొత్తం 3,200 బిఘాల భూమి ఆక్రమించినట్టు రుజువైనా 300 బిఘాలు మాత్రమే విడిపించడంతో విజయ్​ తన ధర్నాను ఆపలేదు. అయితే.. విజయ్​ కృషి వల్ల ముజఫర్‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాలోని పూర్వాజీ ప్రాంతంలో 1,250 బిఘాలు, రామ్‌‌‌‌‌‌‌‌రాజ్, భోపా ప్రాంతాల్లో 50వేల బిఘాల ప్రభుత్వ భూములు కబ్జా కోరల నుంచి బయటపడ్డాయి. ఈ కబ్జాల్లో పాలు పంచుకున్న ఆరుగురు రెవెన్యూ ఉద్యోగులు జైలుకు వెళ్లారు. 


ముజఫర్‌‌‌‌‌‌‌‌నగర్ నుంచి ఫుట్ మార్చ్ 


ఎన్ని రోజులు ధర్నా చేసినా.. న్యాయం జరగకపోవడంతో 30 మార్చి 2012న  విజయ్​ సింగ్ ముజఫర్‌‌‌‌‌‌‌‌నగర్ నుంచి  ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వరకు పాదయాత్ర మొదలుపెట్టాడు. 19 రోజుల్లో 600 కిలోమీటర్లు నడిచి, అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్‌‌‌‌‌‌‌‌ను కలిశాడు. సీఎం కూడా దీనిపై చర్చించి న్యాయం జరిగేటట్టు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చాడు. కానీ.. ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదు. ఆ తర్వాత ఎంతోమంది జిల్లా అధికారులు, రెవెన్యూ కోర్టులు, ముఖ్యమంత్రులకు పిటిషన్లు ఇచ్చాడు. అయినా.. లాభం లేకపోయింది. భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యోగి ఆదిత్యనాథ్‌‌‌‌‌‌‌‌ను కలిసేందుకు కళ్లకు గంతలు కట్టుకుని ఆయన ఆఫీస్​కు వెళ్లాడు. కానీ..  సీఎంని కలిసేందుకు పర్మిషన్​ దొరకలేదు. ఆఫీసర్లు విజయ్​ ఇచ్చిన పిటిషన్​ని తీసుకున్నారు.  


కుటుంబానికి దూరం.. 


ఉద్యమం వల్ల విజయ్​ తన కుటుంబానికి కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం ఆయన అవసరాలను తన నలుగురు ఫ్రెండ్స్​ చూసుకుంటున్నారు. పైగా తనకు కూడా కొంత భూమి ఉంది. దాని మీద వచ్చే ఆదాయాన్ని వాడుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 60 ఏండ్లు. ఈ వయసులో కూడా ‘వెనక్కి తగ్గేది లేదు. తుది శ్వాస వరకు పోరాడతా’ అంటున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. వాళ్లకు పెండ్లిళ్లు అయ్యాయి. కొడుకు చక్కెర మిల్లులో జూనియర్ ఇంజనీర్​గా పనిచేస్తున్నాడు.