మోడీ మంత్రివర్గంలోకి కొత్తగా 28 మంది!

మోడీ మంత్రివర్గంలోకి కొత్తగా 28 మంది!

ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. మరో రెండు రోజుల్లో నూతన మంత్రివర్గాన్ని మోడీ ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా.. ఇప్పటికే 53 మందితో ఉన్న మంత్రి వర్గంలోకి మరో 28 మంది కొత్తవారిని తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు పూర్తిచేశారు. ఆయా శాఖల, మంత్రుల పనితీరును సమీక్షించిన తర్వాత తుది జాబితాను ప్రధాని మోడీ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. రెండు, మూడు శాఖలను పర్యవేక్షిస్తున్న మంత్రులను ఒకే శాఖకు పరిమితం చేసి.. కొత్తవారికి మిగతావాటిని కేటాయించనున్నారు. 

మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. బీజేపీ మిత్రపక్షాలు, ఎన్నికలున్న రాష్ట్రాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అదేవిధంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, అస్సోం, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నేతలకు చోటు దక్కే అవకాశముంది. యూపీ నుంచి వరుణ్ గాంధీ, రాంశంకర్ కథేరియా, రీటా బహుగుణ జోషి, అనిల్ జైన్‌‌లకు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాధిత్య సింథియా, అస్సోం నుంచి సర్బానంద సోనోవాల్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలున్నాయి. బీహార్ నుంచి సుశీల్ మోడీకి స్థానం లభించే అవకాశముంది. బీజేపీ సీనియర్ నేత భూపేంద్ర యాదవ్‌కు స్థానం కల్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జేడీయూ నుంచి లల్లాన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్, సంతోష్ కుష్వాహాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. లోక్ జన శక్తి పార్టీ నుంచి పశుపతి పరాస్‌కి స్థానం కల్పించే అవకాశముంది. అప్నాదళ్ నుంచి అనుప్రియా పాటిల్ పేరు పరిశీలనలో ఉంది.