ఓయూ సెమిస్టర్ పరీక్షలు వాయిదా.. నిర్ణయం తీసుకున్న వర్సిటీ అధికారులు

ఓయూ సెమిస్టర్ పరీక్షలు వాయిదా.. నిర్ణయం తీసుకున్న వర్సిటీ అధికారులు
  • వచ్చే నెల 16 నుంచి నిర్వహణకు షెడ్యూల్ 

ఓయూ,వెలుగు:  ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈనెల 2 నుంచి నిర్వహించాల్సిన 2, 4 సెమిస్టర్​ పరీక్షలు వాయిదా వేశారు. ఆగస్టు 16 నుంచి  నిర్వహించాలని అధికారులు షెడ్యూల్​ ఖరారు చేశారు. సిలబస్​ పూర్తి కానందున పరీక్షలు వాయిదా వేయాలంటూ స్టూడెంట్లు వారం రోజులుగా ఆందోళనలు చేపట్టారు. దీనిపై శనివారం కాలేజీల ప్రిన్సిపాళ్లతో వర్సిటీ అధికారులు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సబ్జెక్టులకు సంబంధించి సిలబస్ పూర్తి కాలేదన్న దానిపై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్స్​ను ఆరాతీశారు.  

భవిష్యత్​ లో ఇలాంటి పరిస్థితి రాకుండా క్యాలెండర్ ప్రకారమే సిలబస్ పూర్తి చేయటం, పరీక్షలు నిర్వహించటం చేయాలని సూచించారు. ఈనెల 26,27 తేదీల్లో ఇంటర్నల్​ పరీక్షలు పూర్తి చేయాలని, ఆగస్టు 16లోపు మిగిలిన సిలబస్​ను కూడా పూర్తి చేయాలని సూచించారు. సాంకేతిక కారణాలతో ఎంసీజే ప్రవేశపరీక్షను తిరిగి నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన తేదీని వీలైనంత త్వరగా వెల్లడించాలని నిర్ణయించారు.