
రెండు రోజుల బ్రేక్ తరువాత మళ్లీ మొదలైన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. నాలుగోవ రోజు అభయహస్తంకు భారీగా అప్లికేషన్స్ వచ్చాయి. ఈ రోజు మొత్తం 3 లక్షల 62 వేల 606 అప్లికేషన్స్ వచ్చాయి. డిసెంబర్ 28న మొదలైన ప్రజాపాలన కార్యక్రమానికి మొత్తం నాలుగు రోజుల్లో కలిపి 13 లక్షల 54 వేల 817 అప్లికేషన్స్ వచ్చాయని అధికారులు వెల్లడించారు. కాగా ఆదివారం, న్యూఇయర్ సందర్భంగా రెండు రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమానికి బ్రేక్ పడింది. తిరిగి ఈరోజు నుంచి యధావిధిగా ప్రజాపాలన-అభయహస్తం దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.
డిజిటలైజ్ చేసేందుకు కసరత్తు
ప్రజా పాలన దరఖాస్తుల సమాచారాన్ని బిగ్ డేటాబేస్ కింద డిజిటలైజ్ చేసేందుకు కసరత్తు మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుని ఆ తరువాత వాటన్నింటిని కంప్యూటరైజ్ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం రెడీ చేయిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులు, అందులో అర్హుల వివరాలతో పాటు ప్రతి కుటుంబానికి చెందిన సమగ్ర సమాచారం ఉండనుంది. గ్రామం యూనిట్‌గా ఒక్క క్లిక్‌తో రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ గ్యారంటీకి ఎంతమంది అప్లై చేసుకున్నారు? వారి అర్హత ఏమిటి? ఎంతమందికి లబ్ధి చేకురుతుంది? అనే వివరాలు తెలుసుకునేలా సాఫ్ట్ వేర్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు లేదు : మంత్రి పొన్నం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా పాలన.. అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ తేదీ పొడిగింపు లేదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జనవరి 2వ తేదీ హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 6వ తేదీలోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వమే ఫాం ఇస్తుంది కనుక.. కుటుంబానికి ఒక దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. అభయ హస్తం కింద దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని.. గడువు ముగిసిన తర్వాత స్థానిక ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.