నట్టనడి సంద్రంలో షిప్లో మంటలు.. నీళ్లలోకి దూకేసిన ప్రయాణికులు.. ముగ్గురు మృతి

నట్టనడి సంద్రంలో షిప్లో మంటలు.. నీళ్లలోకి దూకేసిన ప్రయాణికులు.. ముగ్గురు మృతి

చుట్టూ నీళ్లు.. ఎక్కడా కానరాని తీరం.. సడెన్ గా షిప్ లో మంటలు చెలరేగితే ఏంటి పరిస్థితి.. మంటల్లో కాలేకంటే బతుకు జీవుడా అని దూకేయటమే మార్గం. ఇండోనేషియా సమీపంలో జరిగిన నౌక ప్రమాదంలో కూడా ప్రయాణికులు అదే చేశారు. ఉన్నట్లుండి సడెన్ గా షిప్ లో మంటలు చెలరేగటంతో అందరూ నీళ్లలోకి దూకేశారు. చాలా మందిని కాపాడారు. కానీ కొందరు నీళ్లలోనే చివరిశ్వాస విడిచారు.

షిప్పు ఇంజిన్ లో వచ్చిన మంటలతో భారీ ఎత్తున దట్టమైన పొగలు వెదజల్లుతుంటే.. మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు భయాందోళనకు గురిచేశాయి. ప్రయాణికులకు సేఫ్టీ జాకెట్స్ వేసి నీళ్లలోకి దూకేందుకు సిద్ధం చేస్తున్న విజువల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. బతుకుతామో లేదో అని నీళ్లలోకి దూకే ముందు ఏడుస్తూ తమ కుటుంబ సభ్యులతో ప్రయాణికులు మాట్లాడుతున్న దృశ్యాలు హృదయాన్ని కరిగించేలా ఉన్నాయి. 

ఆదివారం (జులై 20)  280 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసెంజర్ షిప్.. ఇండోనేషియా నార్త్ సులావెసీ ప్రావెన్స్ కు సమీపంలో ఐలండ్ దగ్గర అగ్నిప్రమాదానికి గురైంది.  దీంతో వెంటనే ప్రయాణికులందరూ నీళ్లలో దూకేశారు. అందులో 150 మందిని కాపాడినట్లు చెప్పారు. చైనా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ షినువా (Xinhua), ఇండోనేషియా మీడియా ప్రకారం ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. ఇంకా 130 మంది జాడ తెలియలేదని తెలుస్తోంది. 

మనడో పోర్ట్ కు వెళ్తున్న కేఎం బార్సిలోనా (KM Barcelona 5) కి 280 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ ప్రమాదానికి గురికావడటం ఇండోనేషియాలో కలకలం సృష్టించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. తలిసే ఐలండ్ దగ్గర ఈ ఘటన జరిగినట్లు స్థానిక డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి జెర్రీ హార్మోన్సియా తెలిపారు. 

నీళ్లలో దూకిన వారిలో 150 మందిని కాపాడారని.. మరో 130 మంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మినీ బోట్స్ సహాయంతో గాలిస్తున్నారని.. స్థానిక జాలర్లను కూడా రంగంలోకి దింపినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read:-చెప్పులు నోట్లో పెట్టి.. యూరిన్ తాగించి..భూతవైద్యం పేరుతో ఈ బాబా ఎలాంటి పనులు చేస్తున్నాడో చూండండి !

 ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అగ్రి ప్రమాదం జరగగానే నీళ్లలోకి ప్రయాణికులు దూకుతున్న విజువల్స్ భయంకరంగా కనిపిస్తున్నాయి. అంత పెద్ద ఓడ నుంచి.. అంత ఎత్తునుంచి సముద్రంలో దూకటం సాహసమే. అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడాలంటే ప్రాణాలకు తెగించిన సాహసం చేయాల్సిందే.