
- మనీలాండరింగ్ ఆరోపణలు రావడం వల్లే
న్యూఢిల్లీ: దేశంలోని ముగ్గురు టాప్ స్టాక్ బ్రోకర్లపై వివిధ రెగ్యులేటరీ ఏజన్సీల దర్యాప్తు కొనసాగుతోంది. వేల కోట్ల రూపాయల మనీలాండరింగ్ ట్రాన్సాక్షన్లతోపాటు, ఫ్రాడ్యులెంట్ ట్రేడింగ్ యాక్టివిటీస్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఈ ముగ్గురు టాప్ బ్రోకర్లు ఎదుర్కొంటున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ టాప్ బ్రోకింగ్ కంపెనీల పేర్లను ఇప్పుడే బయటపెట్టలేమని సీనియర్ ప్రభుత్వ ఆఫీసర్లు చెప్పారు. ఈ బ్రోకింగ్ కంపెనీలు దేశంలోని కొంత మంది రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు వారు వెల్లడించారు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యుడి పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గురు టాప్ బ్రోకర్లపైనా గత 4–5 ఏళ్లుగా వివిధ దర్యాప్తు ఏజన్సీల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని ఆ ఆఫీసర్లు చెప్పారు. ఈ టాప్ బ్రోకర్లు క్యాపిటల్ మార్కెట్లలోని వివిధ సెగ్మెంట్లలో ఆపరేట్ చేస్తున్నట్లు వివరించారు. బ్రోకరేజ్, ఇన్వెస్ట్మెంట్ ఎడ్వైజరీ సర్వీసులు, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్, ఎసెట్ మేనేజ్మెంట్ ఫండ్, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి సెగ్మెంట్లలో కార్యకలాపాలను ఆ బ్రోకింగ్ కంపెనీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
రంగంలోకి దిగనున్న సీబీఐ....
సెబీ, ఆర్బీఐ, ఈడీలు ఈ టాప్ 3 స్టాక్ బ్రోకర్లపై ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాయని వెల్లడించారు. కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని గుర్తించడంతో ఇప్పుడు సీబీఐని కూడా రంగంలోకి దించాలని భావిస్తున్నారు. మనీలాండరింగ్ యాక్టివిటీస్‌ను దాచిపెట్టేందుకు కాంప్లెక్స్ ఫైనాన్షియల్ మార్కెట్ ట్రాన్సాక్షన్లను ఆ బ్రోకింగ్ కంపెనీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఫైనాన్షియల్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లతోపాటు, ఫండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి , ఎలా ప్రయాణించాయనే అంశంపైనా, విదేశాలకు (ట్యాక్స్హావెన్స్) తరలించడంపైనా, అలాగే ఆయా బ్రోకర్లకు సంబంధించిన కాల్‌డేటా రికార్డులు, సోషల్ మీడియా సంభాషణలను సైతం దర్యాప్తు ఏజెన్సీలు విశ్లేషిస్తున్నాయని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అవసరమైన సాయం కోసం విదేశీ ప్రభుత్వాలకు కూడా రిక్వెస్టులు పంపినట్లు పేర్కొన్నారు.
కొన్ని వేల కోట్ల రూపాయల మేర డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లు వారు చెబుతున్నారు. స్విట్జర్లాండ్ వంటి కొన్ని దేశాలు తమ రిక్వెస్ట్‌లకు బదులిచ్చాయని వివరించారు. దర్యాప్తు ఏజన్సీలకు సమాచారం ఇవ్వడానికి ముందు తమ క్లయింట్లకు ఒక అవకాశాన్ని సాధారణంగా కొన్ని దేశాలలోని చట్టాల ప్రకారం బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు ఇస్తాయని, ఇప్పుడు ఆ ప్రాసెస్ కొనసాగుతోందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. స్పాట్ కమోడిటీ ఎక్స్చేంజ్ కేసులో మొదటిసారిగా ఈ టాప్ 3 బ్రోకర్ల పాత్ర వెలుగులోకి వచ్చిందని, ఆ తర్వాత మనీలాండరింగ్ ట్రాన్సాక్షన్లలో సైతం వాటికి భాగం ఉన్నట్లు దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయని వారు పేర్కొన్నారు. మనీలాండరింగ్ జరిగిందనే అనుమానాన్ని సెబీ ముందుగా వ్యక్తం చేసిందని, దాంతో ఇతర దర్యాప్తు ఏజెన్సీలు సైతం ఇన్వెస్టిగేషన్‌కు దిగాయని ఆ అధికారులు వెల్లడించారు. బ్రోకర్ల పేర్లు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ అధికారులు వారికి సంబంధించిన కొన్ని వివరాలు మాత్రం చెప్పారు. ఆన్లైన్ బ్రోకింగ్ కంపెనీలు రావడానికి ముందు 2, 3 ఏళ్ల కిందటి దాకా ఆ బ్రోకర్లే దేశంలో టాప్ ప్లేయర్లని వివరించారు.