
- ఎస్ఎన్డీపీ ఫస్ట్ ఫేజ్ కింద 37 నాలాల నిర్మాణాలు
- ఇప్పటివరకు ఒక్క చోట మాత్రమే పూర్తి
- నెలాఖరులోగా 90 శాతం పనులు పూర్తయ్యే చాన్స్
హైదరాబాద్, వెలుగు: సిటీలో వరదల నివారణకు స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రాం(ఎస్ఎన్డీపీ) చేపట్టిన నాలాల పనులకు డెడ్ లైన్ పడింది. ఈ నెల చివరి నాటికి పనులు పూర్తి చేయకపోతే జీతాలు కట్ చేస్తామని బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ అధికారులకు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. జోనల్ కమిషన్లతో పాటు చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్ల జీతాల్లో కోతలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. గ్రేటర్ పరిధిలో ఫస్ట్ ఫేజ్కింద రూ.737.45 కోట్లతో 37 నాలా పనులు చేపట్టాలని ప్రతిపాదించగా.. అందులో 35 చేపట్టారు. వీటిల్లో ఇప్పటి వరకు ఒక్క రసూల్ పురా నాలా మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగతా పనుల్లో కొన్ని కంప్లీట్అవుతుండగా, మరికొన్ని మధ్యలో ఉన్నాయి. అయితే పనుల ఆలస్యానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. మెయిన్ రోడ్లపై నాలాల పనులు చేసేందుకు పోలీసులు పర్మిషన్లు ఇవ్వడం లేదు. మరోపక్క కరెంట్ కేబుళ్లు, వాటర్, డ్రైనేజీ లైన్లతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ అడ్డంకులు తొలగించాల్సిన ఉన్నతాధికారులు ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదు.
వానలు పడినప్పుడే హడావుడి
వర్షాలు కురిసి తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మళ్లీ దృష్టిపెట్టకపోవడంతో సమస్య ప్రతి ఏటా తీవ్రమవుతోంది. గతంలో వర్షాల కారణంగా ముంపునకు గురై నెలరోజులైనా వరద నుంచి కోలుకోలేని కాలనీలు చాలా ఉన్నాయి. నాలాల వైడెనింగ్ చేపడుతున్నామంటూ రెండేళ్ల క్రితం ప్రకటించినప్పటికీ పనులు మాత్రం స్లోగా నడుస్తున్నాయి. నాలాల్లో పూడికతీతను సైతం నామమాత్రంగానే తీస్తున్నారు. వరద ముంపునకు కారణమైన నాలాల పనులను ఈ ఏడాది వర్షాకాలానికి ముందే పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ పనులు అలా జరగలేదు.
మెయిన్ రోడ్లపై మరిన్ని పనులు
మెయిన్ రోడ్లపై మరిన్ని నాలాల పనులను అధికారులు చేపట్టనున్నారు. ఇందులో కర్మన్‌ఘాట్‌లోని మెయిన్ రోడ్ పై ఉన్న హనుమాన్ టెంపుల్ వద్ద ఉన్న బ్రిడ్జి పనులు, రామంతాపూర్‌లోని టీవీ టవర్ సమీపంలోని చెరువు వద్ద మెయిన్ రోడ్డుపై బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలోని బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌లోని మినిస్టర్ రోడ్, నాగోల్‌లోని దేవకి ఫంక్షన్ హాల్ వద్ద బ్రిడ్జిలతో పాటు ఎల్బీనగర్ జోన్‌లోని బాతుల చెరువు, బండ్లగూడ, శంకర్ మఠ్, ఆర్టీసీ క్రాస్ రోడ్ నాలాలతో తదితర ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. డిసెంబర్ చివరి నాటికి అన్ని నాలాల పనులు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించినప్పటికీ 90 శాతం వరకు పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. మిగతా పనులు పూర్తయ్యేందుకు ఇంకా నెలలపాటు టైమ్ పట్టొచ్చని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు.