జైల్లో నెల రోజులు

జైల్లో నెల రోజులు

ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు ఇటు తెలుగు రాష్ట్రాలతోపాటు.. జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. స్కిల్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాజకీయాలను మరింత హీటెక్కించాయి. అయితే, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి ఇవాళ్టికి ( అక్టోబర్ 8) సరిగ్గా నెలరోజులైంది. నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ దగ్గర నుంచి.. రిమాండ్‌, పిటిషన్లు, విచారణలతో.. చంద్రబాబు ఎపిసోడ్‌ సర్వాత్రా హాట్‌ టాపిక్‌గా మారింది. స్కిల్ స్కామ్‌ కేసు రాజకీయ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తుంటే.. అన్ని ఆధారాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో అప్పుడే చంద్రబాబు అరెస్ట్‌ అయి ముప్పై రోజులు గడిచిపోయింది.

ALSO READ : ఇదేమి కాలంరా బాబూ: విశాఖలో కాక రేపుతున్న భానుడు

టీడీపీ ప్రాజెక్టుల యాత్రలో భాగంగా నంద్యాలలో బస చేసిన చంద్రబాబును సెప్టెంబర్‌ 9న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా.. నోటీసులు ఇవ్వకపోవడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్ర వాగ్వాదం మధ్య చంద్రబాబును అరెస్ట్‌ చేస్తున్నట్టు సీఐడీ అధికారులు ప్రకటించారు. అరెస్ట్‌ అనంతరం ఆయన కాన్వాయ్‌లోనే విజయవాడకు తరలించి.. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.

స్కిల్ స్కామ్‌లో కేసులో చంద్రబాబు అరెస్ట్‌, పిటిషన్లు, విచారణకు సంబంధించిన వివరాలు  

చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసు డైరీ..

  • సెప్టెంబర్‌ 9న అరెస్ట్‌
  • సెప్టెంబర్‌ 10న రిమాండ్‌
  • సెప్టెంబర్‌ 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌
  • సెప్టెంబర్‌ 14న ఏసీబీ కోర్ట్‌లో బెయిల్ పిటిషన్
  • సెప్టెంబర్‌ 15కి బెయిల్ పిటిషన్ వాయిదా
  • సెప్టెంబర్‌ 19న హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్
  • సెప్టెంబర్‌ 22న రెండు రోజుల సీఐడీ కస్టడీ
  • సెప్టెంబర్‌ 22న హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ డిస్మిస్
  • సెప్టెంబర్‌ 24వరకు రిమాండ్‌ పొడిగింపు
  • అక్టోబర్ 5న మరోసారి రిమాండ్ పొడిగింపు
  • అక్టోబర్‌ 19వరకు జ్యుడీషియల్ రిమాండ్
  • అక్టోబర్ 3న సుప్రీంలో క్వాష్ పిటిషన్‌పై వాదనలు
  • అక్టోబర్‌ 9కి క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా

స్కిల్ కేసుకి సంబంధించి చంద్రబాబు.. సీఐడీ వాదనలు ఇలా..

చంద్రబాబు వాదనలు

  • అరెస్ట్ అక్రమం, అన్యాయం
  • 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు
  • రాజకీయ ప్రతీకారం
  • విచారణ ప్రక్రియ అపహస్యం
  • సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ నుంచి విరాళాలు రాలేదు
  • బెయిల్ రాకుండా ఉద్దేశపూర్వక కుట్ర

సీఐడీ వాదనలు

  • అన్ని ఆధారాలు ఉన్నాయి
  • చంద్రబాబుకు 17ఏ వర్తించదు
  • షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు
  • ఖాజానాకు భారీగా నష్టం
  • టీడీపీ ఖాతాలోకి రూ.27కోట్లు
  • మరింత లోతుగా విచారించాల్సిన అవసరం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు ( అక్టోబర్ 9)  సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. రేపు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్, కస్టడీ పిటిషన్లపై కూడా విచారణ జరగనుంది. మొత్తానికి మండే చంద్రబాబుకు అత్యంత కీలకంగా కనిపిస్తోంది.