కుంభమేళాలో 30 మంది సాధువులకు కరోనా

కుంభమేళాలో 30 మంది సాధువులకు కరోనా

హరిద్వార్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. గతేడాది కంటే ఈ సంవత్సరం వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గురువారం ఒక్కరోజే 2.17 లక్షల పైచిలుకు కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదిలావుంటే కుంభమేళాలోనూ కరోనా ప్రభావం కనిపిస్తోంది. పుణ్యస్నానాల కోసం లక్షలాది మంది హరిద్వార్‌‌కు తరలివస్తుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మేళాలో 30 మంది సాధువులు వైరస్ పాజిటివ్‌గా తేలారు. 

ఆలిండియా అఖండ పరిషత్ లీడర్ మహంత్ నరేంద్ర గిరికి కూడా కరోనా సోకింది. దీంతో ఆయనను రిషికేష్‌‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌‌కు చెందిన మహా నిర్వాణ అఖండకు లీడర్‌‌గా ఉన్న ప్రముఖ సాధువు స్వామి కపిల్ దేవ్ కరోనా చికిత్స పొందుతూ డెహ్రాడూన్‌‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చనిపోయారు. కరోనా డేంజర్‌‌ను దృష్టిలో ఉంచుకొని మేళా నుంచి నిర్ణీత షెడ్యూల్ కంటే రెండు వారాలు ముందే వెళ్లిపోవాలని నిర్ణయించామని నిరంజనీ అఖండా పేర్కొంది. నిరంజనీ, జునాతోపాటు చాలా అఖండాల్లో కేసులు పెరుగుతున్నాయని హరిద్వార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్‌‌కే ఝా తెలిపారు.