
- కరోనాలో కొత్త వేరియంట్ గుర్తింపు
- బోట్స్ వానా, సౌతాఫ్రికా, హాంకాంగ్‌లో కేసులు
న్యూఢిల్లీ/ధార్వాడ్: కరోనాలో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఆఫ్రికాలోని బోట్స్ వానాలో గుర్తించిన ఈ వేరియంట్ కు బీ.1.1.529గా పేరు పెట్టారు. ఇందులో ఏకంగా 32 మ్యుటేషన్లు జరిగాయని తేలింది. అయితే, ట్రీట్ మెంట్ తీసుకోని ఓ హెచ్ఐవీ పేషంట్ నుంచే ఈ వేరియంట్ అనేక మ్యుటేషన్ లు చేసుకుని ఇతరులకు వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ కేసులు ఇప్పటి వరకు 10 మాత్రమే నమోదైనప్పటికీ, స్పైక్ ప్రొటీన్లలో అత్యధిక మ్యుటేషన్ల కారణంగా ఇది చాలా డేంజరస్ గా మారొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొదట బోట్స్ వానాలో 3 కేసులు నమోదు కాగా, సౌతాఫ్రికాలో 6, హాంకాంగ్ లో ఒకటి రికార్డయ్యాయి. ఇటీవల సౌతాఫ్రికా నుంచి తిరిగొచ్చిన వ్యక్తి ద్వారా హాంకాంగ్ లో ఈ వేరియంట్ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇది రోగ నిరోధక శక్తిని కూడా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీన్ని ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఏ మేరకు అడ్డుకుంటాయనేది చెప్పలేమంటున్నారు. ఒకే వేరియంట్ లో పెద్ద సంఖ్యలో మ్యుటేషన్లు ఉండడం ఆందోళన కలిగించే విషయమని లండన్ ఇంపీరియల్ కాలేజీలోని వైరాలజిస్ట్ డాక్టర్ టామ్ పీకాక్ అన్నారు. ‘‘ఇది ఎలా వ్యాప్తి చెందుతుందనేది ఇప్పుడే చెప్పలేం. దీనిపై మరింత రీసెర్చ్ అవసరం. కానీ రానున్న రోజుల్లో వ్యాప్తి పెరిగితే జాగ్రత్త పడాలి’’ అని ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ సూచించారు. కాగా, ఈ వేరియంట్ పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) అధికారులు గురువారం చర్చించారు. దీనిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని చెప్పారు.
కొత్త వేరియంట్ పై జాగ్రత్త: కేంద్రం
సౌత్ ఆఫ్రికా, తదితర దేశాల్లో బయటపడిన కొత్త కరోనా వేరియంట్ (బీ.1.1.529) విషయంలో అన్ని రాష్ట్రాలు, యూటీలు అలర్ట్ గా ఉండాలని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ హెచ్చరించింది. అత్యధిక మ్యుటేషన్ల కారణంగా ఈ వైరస్ తీవ్రంగా విజృంభించే ప్రమాదం ఉందని, అందువల్ల ఆయా దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లకు తప్పనిసరిగా టెస్టులు చేయాలని చెప్పింది. విదేశీ ప్యాసింజర్లకు పాజిటివ్ వస్తే.. వారి శాంపిళ్లను వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపాలని సూచించింది. కాగా, దేశవ్యాప్తంగా గురువారం కొత్తగా 9,119 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరిందని కేంద్రం వెల్లడించింది. మరో 396 మంది చనిపోయారని, మొత్తం డెత్స్ సంఖ్య 4,66,980కి చేరిందని తెలిపింది.