కొత్తపల్లి సొసైటీ సొమ్ము స్వాహా?

కొత్తపల్లి సొసైటీ  సొమ్ము స్వాహా?

కోటగిరి, వెలుగు: రైతులకు సేవలు అందించేందుకు ప్రభుత్వం సహకార సంఘాలను ఏర్పాటు చేసింది. అయితే కొన్ని సంఘాల పాలకర్గాలు సేవలందించడం ఏమోగాని రైతులను నిండా ముంచుతున్నాయి. ఇందుకు నిజామాబాద్‌‌‌‌ జిల్లా కోటగిరి మండలంలోని కొత్తపల్లి సొసైటీ నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సొసైటీలో లక్షల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సొసైటీ 2021‌‌‌‌-22 సంవత్సరానికి సంబంధించి జమా ఖర్చులపై ఇటీవల ఆడిట్ నిర్వహించారు. సొసైటీ రూ.50 లక్షల లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్టు ఆఫీసర్లు నిర్ధారించారు. 

తప్పుడు లెక్కలతో...

సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అదనపు సిబ్బందిని నియమించకున్నా.. నియమించినట్టు లెక్కలు చూపి లక్షల రూపాయలు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సొసైటీ పరిధిలోని రైస్ మిల్‌‌‌‌ రిపేర్లకు రూ.32 లక్షలు ఖర్చు చేసినట్లు చూపడం ఆడిట్ ఆఫీసర్లను విస్మయానికి గురిచేసింది. వాస్తవానికి రైస్ మిల్ రిపేర్ చేయాలంటే ముందుగా పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అవేమీ చేయకుండానే రూ.32 లక్షలతో ఎలా రిపేర్లు చేయించారనేది తెలియడం లేదు. దీంతో పాటు కార్యాలయ నిర్వహణ, సిబ్బంది జీత భత్యాల చెల్లింపులు, సాధారణ ఖర్చుల్లో కూడా భారీగా అవకతవకలు జరిగినట్లు అధికారులు 
గుర్తించినట్లు తెలిసింది. 

రాజీనామాపై అనుమానాలు...

సొసైటీలో జరిగిన లావాదేవీలపై పాలకర్గానికి డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 3 దాకా సమయం ఇస్తూ వివరణ ఇవ్వాలని ఆడిట్ ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు. ఇంతలో సొసైటీ సెక్రటరీ రాజీనామా చేశారు. దీంతో పాలకర్గంపై ఉన్న అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

ఏకగ్రీవంగా ఎన్నుకుంటే..

కొత్తపల్లి పాలకర్గాన్ని రైతులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంతో నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అవకతవకలకు పాల్పడి సొసైటీని నిండా ముంచుతున్నారని రైతులు మండిపడుతున్నారు. ఒక ఏడాదిలోనే రూ.50 లక్షల అవినీతి జరిగితే.. మూడేళ్ల ఎన్ని ఖాజేశారో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి పాలకవర్గంపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.