కామారెడ్డిటౌన్, వెలుగు : ప్రతి ఒక్కరికీ ఫిట్నెస్ అవసరమని, ఆరోగ్యం కోసం నిత్యం ఎక్ససైజ్చేయడం అలవాటు చేసుకోవాలని కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్ అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మంగళవారం కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇందిరా గాంధీ స్టేడియం వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని, అందుకే సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా యూత్ వెల్ఫేర్ అధికారి రంగ వెంకటేశ్వర్‌గౌడ్, ప్రతినిధులు హీరాలాల్, మధుసూదన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్రాస్ కంట్రీ పోటీలకు క్రీడకారుల ఎంపిక
రాష్ర్టస్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు మంగళవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులను ఎంపిక చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన క్రీడకారులను రాష్ర్టస్థాయికి ఎంపిక చేశారు.
పోటీలను అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్ ప్రారంభించారు. జిల్లా యూత్, స్పోర్ట్స్ అధికారి రంగ వెంకటేశ్వర్‌గౌడ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ జైపాల్‌రెడ్డి, సెక్రటరీ అనిల్‌కుమార్, ఎస్జీఎఫ్ సెక్రటరీ హీరాలాల్, ప్రతినిధులు మధుసూదన్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి, సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు.
