ఫైవ్‌ స్టార్ట్ హోటల్‌లో పార్టీ.. 37 మంది అరెస్ట్

ఫైవ్‌ స్టార్ట్ హోటల్‌లో పార్టీ.. 37 మంది అరెస్ట్

కోల్‌కతా: ఓ వైపు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా కొంత మంది జనాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కరోనా రూల్స్ పాటించకుండా వైరస్‌కు ఓపెన్ ఇన్విటేషన్లు ఇస్తున్నట్టే బిహేవ్ చేస్తున్నారని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఫైర్ అయింది. టూరిస్టు స్పాట్లు, హోటళ్లలో పబ్లిక్ బిహేవియర్‌‌ను చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు పెట్టుకోవడం వంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని, లేదంటే కరోనాకు బలి కావల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. అయినా కొంత మంది తీరులో మార్పు రావడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నా ఆ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో కరోనా రూల్స్ పాటించకుండా పార్టీ చేసుకుంటున్న 37 మందిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులతో దురుసు ప్రవర్తన
కోల్‌కతా సిటీలోని ది పార్క్‌ హోటల్‌లో శనివారం అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో రైడ్స్‌ చేసి కరోనా రూల్స్ ఉల్లంఘించి పార్టీల్లో ఎంజాయ్ చేస్తున్న 37 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఆ సమయంలో కొంత మంది పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అధికారులు తెలిపారు. వారి నుంచి రెండు కార్లు, గంజాయి, లిక్కర్ బాటిళ్లు సీజ్ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో జులై 15 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉన్నాయని, ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే సడలింపులు ఉన్నాయని, అయినా లెక్క చేయకుండా పార్టీ చేసుకుంటున్నారని, వారిని అరెస్టు చేసి డిజాస్టర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని అన్నారు.