ఇరిగేషన్ విభాగంలో లష్కర్లుగా 3,730 మంది

ఇరిగేషన్ విభాగంలో లష్కర్లుగా 3,730 మంది

తహసీల్దార్ల నుంచి వివరాలు కోరిన సీసీఎల్ఏ

హైదరాబాద్, వెలుగు: ఇటీవల వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన ప్రభుత్వం.. రెవెన్యూ శాఖలో వీఆర్ఏలు నిర్వర్తించాల్సిన విధులు, ఇతర శాఖల్లో సర్దుబాటు అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల వివరాలు సేకరించే పనిలో పడింది. తమకు పే స్కేల్ ఇవ్వాలని, అర్హులైనోళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలంటూ ఓ వైపు వీఆర్ఏలు సమ్మె చేస్తున్న క్రమంలో ప్రభుత్వం వారి వివరాలు సేకరించడం ప్రాధాన్యత ఏర్పడింది. వీఆర్ఏ పేరు, ప్రస్తుతం పని చేస్తున్న మండలం, గ్రామం, క్వాలిఫికేషన్లు, ఉద్యోగంలో జాయిన్ అయిన తేదీ, పద్ధతి(డైరెక్ట్ రిక్రూట్మెంట్, వారసత్వ ఉద్యోగం, ప్రమోషన్), పెండింగ్ లో ఉన్న డిసిప్లినరీ కేసులు, తదితర వివరాలన్నీ ప్రత్యేక ఫార్మాట్​లో శుక్రవారం సాయంత్రంలోగా పంపాలని సీసీఎల్ఏ అధికారులు అన్ని జిల్లాల్లోని తహసీల్దార్లను ఆదేశించారు.

లష్కర్లుగా 3,730 మంది..

ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 22 వేల మంది వీఆర్ఏలు పని చేస్తున్నారు. వీరిలో పదో తరగతి లోపు విద్యార్హతలు ఉన్నవాళ్లు 3,730 మంది ఉన్నారని తెలిసింది. టెన్త్, ఇంటర్, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన మిగతా వీఆర్ఏలు 18 వేల మంది ఉండగా, ఇందులోనూ ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినవారు 3 వేల మంది వరకు ఉన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో వీళ్లకు ప్రమోషన్ చాన్స్ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే వీఆర్ఏ సమస్యలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మార్చి 14న మాట్లాడుతూ రెవెన్యూ డిపార్ట్​మెంట్ కింద పనిచేస్తున్న వీఆర్ఏలను ఇక నుంచి ఇరిగేషన్ శాఖలో కలపనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు పది లోపు చదివిన 3,730 మంది వీఆర్ఏలను ఇరిగేషన్ డిపార్ట్​మెంటులో లష్కర్లుగా పంపి, మిగతావాళ్లను రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలోనే సర్దుబాటు చేయనున్నట్లు తెలిసింది.