
- 2-0తో సిరీస్ కైవసం
- రాహుల్, ధవన్ హాఫ్ సెంచరీలు
- శార్దుల్ ఆల్‌రౌండ్ షో
సీజన్ మారినా ఇండియా ఆధిపత్యంలో ఎలాంటి మార్పు లేదు. ప్రయోగాలు చేసినా ఫలితంలో తేడా రావడం లేదు..! గతేడాది ఎదురైన జట్టునల్లా చిత్తు చేసిన కోహ్లీసేన కొత్త ఏడాదిలోనూ అదే జోరు చూపెట్టింది..! తమ స్థాయికి ఏ మాత్రం సరితూగని శ్రీలంకను వరుసగా రెండో టీ20లోనూ చిత్తుగా ఓడిస్తూ సిరీస్‌ను పట్టేసింది..! పవర్‌ఫుల్ బ్యాటింగ్.. పదునైన బౌలింగ్.. మెరుపు ఫీల్డింగ్‌తో పుణెలో లంకేయులను ఉక్కిరిబిక్కిరి చేసింది..! ఓపెనర్ స్లాట్ కోసం పోటీ పడుతున్న శిఖర్ ధవన్, లోకేశ్ రాహుల్ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్రీజులో ఉన్నది కొద్దిసేపే అయినా కెప్టెన్ కోహ్లీ ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు..! పెండ్లైన త్వరాత ఫస్ట్ మ్యాచ్ ఆడిన మనీశ్ పాండే మెరుపులు మెరిపిస్తే.. నేనేం తక్కువా అన్నట్టు పేసర్ శార్దుల్ ఠాకూర్ కూడా దంచికొట్టడంతో ఇండియా ఈజీగా దోసౌ రన్స్ చేసింది..! ఆపై పేసర్లు నవ్‌దీప్, శార్దుల్, బుమ్రాతో పాటు సుందర్ పోటాపోటీగా వికెట్లు పడగొట్టడంతో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన లంక చిత్తుగా ఓడిపోయింది..!
పుణె:
కొత్త ఏడాదిని ఇండియా సిరీస్ విజయంతో ఆరంభించింది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఇక్కడి ఎమ్‌సీఏ స్టేడియంలో శుక్రవారం జరిగిన మూడో, చివరి మ్యాచ్‌లో కోహ్లీసేన 78 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. లోకేశ్ రాహుల్ (36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 54), శిఖర్ ధవన్ (36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు చేసింది. మనీశ్ పాండే (18 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్), విరాట్ కోహ్లీ (17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 26)తో పాటు చివర్లో శార్దుల్ ఠాకూర్ (8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 22 నాటౌట్) సత్తా చాటాడు. ఛేజింగ్‌లో ఇండియా కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి లంక 15.5 ఓవర్లలో 123 రన్స్‌కే ఆలౌటైంది. ధనంజయ డిసిల్వ (57), ఏంజెలో మాథ్యూస్ (31) మాత్రమే పోరాడారు. నవ్‌దీప్ సైనీ (3/28) మూడు, శార్దుల్ ఠాకూర్ (2/19), సుందర్ (2/37) రెండేసి వికెట్లు తీశారు. శార్దుల్ ఠాకూర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సైనీకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
లంక ఢమాల్
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో శ్రీలంక ఏ దశలోనూ ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు తీసిన హోమ్‌టీమ్ బౌలర్లు లంకను డిఫెన్స్‌లోకి నెట్టారు. ఫస్ట్ ఓవర్లోనే ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మన్ గుణతిలక (1)ను ఔట్ చేసిన బుమ్రా ప్రత్యర్థికి షాకిచ్చాడు. అతని షార్ట్ బాల్‌ను పుల్‌చేసే ప్రయత్నంలో దనుష్క.. మిడాన్‌లో సుందర్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్ సెకండ్ బాల్‌కు అవిష్క ఫెర్నాండో (9) సిక్సర్ బాదగా.. నెక్ట్స్ బాల్‌కు లైన్ మార్చి అతడిని ఔట్ చేసిన శార్దుల్ ఠాకూర్ రివెంజ్ తీర్చుకున్నాడు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో కుశాల్ పెరీరా (7)తో సమన్వయ లోపంతో ఒషాడ ఫెర్నాండో (2) పేలవ రీతిలో రనౌటయ్యాడు. ఆ వెంటనే నవ్‌దీప్ సైనీ కళ్లు చెదిరే యార్కర్‌తో పెరీరాను క్లీన్‌బౌల్డ్ చేయడంతో 26/4తో కష్టాల్లో పడ్డ లంక ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగదనిపించింది. అయితే, 16 నెలల విరామం తర్వాత టీ20 ఆడుతున్న సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వ అనూహ్యంగా ఎదురుదాడికి దిగారు. స్పిన్నర్లు సుందర్, చహల్ బౌలింగ్‌లో ఈ ఇద్దరూ భారీ షాట్లతో బౌండ్రీలు రాబట్టడంతో 11 ఓవర్లకు 88/4తో నిలిచిన లంక పుంజుకునేలా కనిపించింది. కానీ, తర్వాతి ఓవర్లోనే పాండే పట్టిన చురుకైన క్యాచ్‌తో మాథ్యూస్‌ను ఔట్ చేసిన సుందర్.. ఐదో వికెట్‌కు 68 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. అక్కడి నుంచి లంక మరింత వేగంగా పతనమైంది. 14 ఓవర్లో షనక (9).. శార్దుల్‌కు రిటర్న్ క్యాచ్ ఇవ్వగా.. హసరంగ (0) రనౌటయ్యాడు. కొద్దిసేపటికే వాషింగ్టన్ బౌలింగ్‌లో సందకన్(1) స్టంపౌటవగా.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ధనంజయతో పాటు మలింగ (0) వికెట్లు తీసిన సైనీ 16వ ఓవర్లోనే మ్యాచ్‌ను ముగించాడు.
ధనాధన్.. ఫటాఫట్..
ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్‌ను పక్కనబెట్టిన మేనేజ్‌మెంట్.. సంజు శాంసన్, మనీశ్ పాండే, యుజ్వేంద్ర చహల్‌ను తీసుకుంది. టాస్ ఓడిన ఇండియా బ్యాటింగ్‌కు దిగగా ఓపెనర్లు లోకేశ్, ధవన్ పోటాపోటీగా పరుగులు రాబట్టారు. ప్రత్యర్థి బౌలింగ్ కూడా వీక్‌గా ఉండడంతో స్వేచ్ఛగా షాట్లు కొట్టారు. మలింగ వేసిన ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్‌ను పాయింట్ దిశగా బౌండ్రీ దాటించిన రాహుల్ హిట్టింగ్ మొదలుపెట్టాడు. మాథ్యూస్ వేసిన తర్వాతి ఓవర్లో ధవన్ ఔటైయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. అతనిచ్చిన టఫ్ క్యాచ్‌ను డీప్ స్క్వేర్ లెగ్ దగ్గర దాసున్ షనక డ్రాప్ చేయగా.. బంతి బౌండ్రీ దాటింది. అదే ఓవర్లో రాహుల్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఆపై, ధనంజయ డిసిల్వ బౌలింగ్‌లో ధవన్ మిడాన్ మీదుగా బౌండ్రీ రాబట్టగా.. రాహుల్ క్లాసిక్ షాట్‌తో సిక్సర్ కొట్టడంతో స్టేడియం మార్మోగింది. ఆ తర్వాత లోకేశ్ స్ట్రయిక్ రొటేట్ చేసే బాధ్యత తీసుకోగా.. శిఖర్ ఒక్కసారిగా జోరు పెంచాడు. మంచి ఫుట్‌వర్క్‌తో తన ట్రేడ్‌మార్క్ షాట్లతో విజృంభించాడు. లహిరు కుమార వేసిన ఆరో ఓవర్లో 2 ఫోర్లు, మాథ్యూస్ బౌలింగ్‌లో థర్డ్‌మన్ మీదుగా బౌండ్రీ, డిసిల్వ వేసిన పదో ఓవర్లో స్లాగ్ స్వీప్ షాట్‌తో భారీ సిక్సర్‌తో రెచ్చిపోయాడు. అదే జోరుతో 34 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శిఖర్ మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో గుణతిలకకు క్యాచ్ ఇవ్వడంతో ఫస్ట్ వికెట్‌కు 97 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. రీఎంట్రీలో వన్‌డౌన్‌లోవచ్చిన శాంసన్ (6) తన ఫస్ట్ బాల్‌నే లాఫ్టెడ్ షాట్‌తో లాంగాఫ్ మీదుగా సిక్సర్‌గా మలచి కెప్టెన్‌తో పాటు అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ, తర్వాతి ఓవర్లో హసరంగ వేసిన గూగ్లీని రాంగ్ లైన్‌పై ఆడిన సంజు ఎల్బీ అయ్యాడు. ఇక అప్పటిదాకా సింగిల్స్‌కే పరిమితమైన రాహుల్ ఫోర్‌తో మళ్లీ వేగం పెంచాడు. సందకన్ (12వ) ఓవర్లో డబుల్‌తో 34 బాల్స్‌లో ఫిఫ్టీ దాటిన అతను జోరు పెంచే ప్రయత్నంలో స్టంపౌటయ్యాడు.ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్ (4)ను సందకన్ రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేశాడు. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఇండియా 13 ఓవర్లకు 123/4తో నిలవగా.. లంక బౌలర్లు రేసులోకి వచ్చినట్టు కనిపించారు. అయితే, ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ విరాట్ ఇన్నింగ్స్‌లో మళ్లీ ఊపు తెచ్చాడు. మాథ్యూస్ వేసిన 17వ ఓవర్లో సైట్‌స్క్రీన్ పైనుంచి కళ్లు చెదిరే సిక్సర్, ఓ ఫోర్ సాధించాడు. కానీ, తర్వాతి ఓవర్లో లేని డబుల్ కోసం ప్రయత్నించి విరాట్ రనౌటవగా.. వాషింగ్టన్ (0)ను డకౌట్ చేసిన కుమార ఇండియా జోరును అడ్డుకున్నాడు. కానీ, చివరి రెండు ఓవర్లలో శార్దుల్ ఠాకూర్, మనీశ్ పాండే మెరుపు బ్యాటింగ్‌తో అలరించారు. ముఖ్యంగా పేసర్ శార్దుల్ టాపార్డర్ బ్యాట్స్‌మన్‌ను తలపించేలా భారీ షాట్లు కొట్టాడు. మలింగ వేసిన షార్ట్ బాల్‌ను బేస్‌బాల్ స్టయిల్లో మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్ కొట్టి ఔరా అనిపించాడు. కుమార వేసిన లాస్ట్ ఓవర్లో లెంగ్త్ బాల్‌ను ఫ్రంట్‌ఫుట్‌పై నేరుగా స్టాండ్స్‌కు పంపిన అతను తర్వాతి బాల్‌ను ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బౌండ్రీకి తరలించాడు. ఐదో బాల్‌కు ఫోర్ బాదిన మనీశ్ లాస్ట్ బాల్‌కు డబుల్‌తో స్కోరు 200 మార్కు దాటించాడు.
ఐదేళ్ల తర్వాత వచ్చి ఆరు రన్స్‌కే..
చాలా రోజుల నుంచి జట్టుతో పాటు ఉంటున్న వికెట్ కీపర్ సంజు శాంసన్ ఎట్టకేలకు ఫైనల్ లెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. 2015లో టీ20 అరంగేట్రం చేసిన శాంసన్.. గతేడాది బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు మళ్లీ జట్టులోకి వచ్చాడు. కానీ, అప్పటి నుంచి ఎనిమిది మ్యాచ్‌లు జరిగినా.. అతనికి ఒక్క అవకాశం కూడా రాలేదు. చివరకు ఈ మ్యాచ్‌లో చాన్స్ దొరికింది. దీంతో ఐదేళ్ల తర్వాత అతను టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఈ సమయంలో ఇండియా 73 మ్యాచ్‌లు ఆడడం గమనార్హం. కానీ, ఐదేళ్ల బ్రేక్ తర్వాత టీ20 ఆడిన సంజు ఆనందం రెండు బంతుల్లో.. ఆరు పరుగులతోనే ఆవిరైంది.
స్కోర్‌బోర్డ్
ఇండియా: రాహుల్ (స్టంప్డ్) పెరీరా (బి) సందకన్ 54, ధవన్ (సి) గుణతిలక (బి) సందకన్ 52, శాంసన్ (ఎల్బీ) హసరంగ 6, మనీశ్ (నాటౌట్) 31, అయ్యర్ (సి అండ్ బి) సందకన్ 4, కోహ్లీ (రనౌట్) 26, సుందర్ (సి) సందకన్ (బి) కుమార 0, శార్దుల్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 201/6; వికెట్ల పతనం: 1–97, 2–106, 3–118, 4–122, 5–164, 6–164; బౌలింగ్: మలింగ 4–0–40–0, మాథ్యూస్ 3–0–38–0, ధనంజయ డి సిల్వ 1–0–13–0, లహిరు కుమార 4–0–46–1, హసరంగ 4–0–27–1, సందకన్ 4–0–35–3.
శ్రీలంక: గుణతిలక (సి) సుందర్ (బి) బుమ్రా 1, అవిష్క (సి) అయ్యర్ (బి) శార్దుల్ 9, పెరీరా (బి) సైనీ 7, ఒషాడ (రనౌట్/పాండే) 2, మాథ్యూస్ (సి) పాండే (బి) సుందర్ 31, ధనంజయ (సి) బుమ్రా (బి) సైనీ 57, షనక (సి అండ్ బి) శార్దుల్ 9, హసరంగ (రనౌట్/చహల్) 0, సందకన్ (స్టంప్డ్) శాంసన్ (బి) సుందర్ 1, మలింగ (సి) కోహ్లీ (బి) సైనీ 0, కుమార (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 15.5 ఓవర్లలో 123 ఆలౌట్; వికెట్ల పతనం: 1–5, 2–11, 3–15, 4–26, 5–94, 6–110, 7–110, 8–118, 9–122, 10–123; బౌలింగ్: బుమ్రా 2–1–5–1, శార్దుల్ 3–0–19–2, సైనీ 3.5–0–28–3, సుందర్ 4–0–37–2, చహల్ 3–0–33–0.