
హిమాచల్ ప్రదేశ్ లో మంగళ వారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా ప్రాంతంలోని ధర్మశాలకు 22కిలో మీటర్ల దూరంలో భూకంపం వచ్చింది. 19కిలోమీటర్ల లోతులో ఇది సంభవించినట్లు అధికారులు తెలిపారు. కాంగ్రా జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలలో కూడా దీని ప్రభావం ఉన్నట్లు చెప్పారు. ఈ రెండు ప్రాంతాలలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగలేదు. అయితే ఎప్రిల్ 6న చంబాలో భూకంపం సంభవించింది అప్పటి తీవ్రత 3.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. బౌగోళిక స్థానం కారణంగా ప్రతీ సంవత్సరం డజన్ల కొద్ది తేలికపాటి భూకంపాలను హిమాచల్ ప్రదేశ్ చవిచూస్తుంది. మండి వరకు నడిచే ప్రధాన సరిహద్దు లోపం కారణంగా చంబా మరియు కాంగ్రా ప్రాంతంలో ప్రకంపనలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.