థియేటర్లు ఓపెన్: హాల్ అంతా ఖాళీ.. నలుగురికి షో

థియేటర్లు ఓపెన్: హాల్ అంతా ఖాళీ.. నలుగురికి షో

కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అన్ లాక్-5.0లో భాగంగా దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ ఇవాళ్టి నుంచి థియేటర్లు ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో సినిమా హల్స్ ఓపెన్ చేశారు. కొత్తగా ఏ సినిమాలూ రిలీజ్ కాకున్నా పాత సినిమాలనే మళ్లీ వేసేందుకు సిద్ధపడ్డారు సినిమా హాల్ ఓనరు. ఇలా పాత సినిమా వేసేందుకు టికెట్ కౌంటర్ తెరిచిన ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ ఏరియాలో ఉన్న ఓ థియేటర్ యాజమాన్యానికి చేదు అనుభవం ఎదురైంది.

కరోనా భయంతో సినిమాలు చూసేందుకు ఎవరూ రాకపోవడంతో టికెట్లు పెద్దగా అమ్ముడుపోలేదు. థియేటర్ లోని సగం సీట్లకే బుకింగ్ ఇవ్వాలని ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం మొత్తం 300 సీట్లు ఉన్నా 150కి మాత్రమే టికెట్లు పెట్టారు. అయితే కేవలం నలుగురంటే నలుగురు మాత్రమే టికెట్లు కొన్నారు. ఉదయం 11.30కి స్టార్ట్ చేయాల్సిన షో దాదాపు అరగంట ఆలస్యంగా మొదలు పెట్టినా ఎవరూ అటు అడుగు కూడా పెట్టలేదు. దీంతో ఏం చేయలేక థియేటర్ అంతా ఖాళీగానే ఉన్నా వచ్చిన నలుగురికే షో వేశారు. మధ్యాహ్నం 2.30 గంటల షో వేసేటప్పటికైనా జనం పెరుగుతారన్న ఆశపడ్డాడో ఏమో మళ్లీ టికెట్ బుకింగ్ తెరిచినా ఐదుగురు మాత్రమే వచ్చారు. థియేటర్ కి వచ్చిన ఓ వ్యక్తిని ప్రశ్నించగా ‘కరోనా రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చా’ అని, ఆ కుతూహలంతోనే టికెట్ కొని సినిమా చూడాలని వచ్చానని చెప్పాడు. అలాగే శుక్రవారం సినిమా చూసేందుకు టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి వచ్చాడు అనంద్ అనే మరో వ్యక్తి. అతడు మాట్లాడుతూ తాము ప్యామిలీ మొత్తం కలిసి థియేటర్ లో కూర్చుని సినిమా చూడాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నామని, ఆ కోరిక ఇన్నాళ్లకు తిరబోతోందని చెప్పాడు. ఇన్నాళ్లు ఇంట్లోనే ఎటూ వెళ్లకుండా కూర్చోవడంతో పిల్లలపై సైకలాజికల్ గా ఎఫెక్ట్ పడుతుందని భయమేసిందని అన్నాడు.