బిహార్​లో కూలిన మరో బ్రిడ్జి..వారం రోజుల్లో ఇది మూడో ఘటన

బిహార్​లో కూలిన మరో బ్రిడ్జి..వారం రోజుల్లో ఇది మూడో ఘటన

 

మోతిహారి: బిహార్ లో మరో వంతెన కూలిపోయింది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఉన్నట్టుండి ఆదివారం కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈస్ట్ చంపారన్​ జిల్లాలోని ఘోరసహన్ బ్లాక్ లో ఈ బ్రిడ్జిని రూరల్ వర్క్స్​ డిపార్ట్ మెంట్ నిర్మిస్తోంది. పదహారు మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిని పూర్తిచేయడానికి ప్రభుత్వం రూ.1.5 కోట్లు కేటాయించింది. నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండగానే ఆదివారం ఈ బ్రిడ్జి కుప్పకూలింది. 

ఆ సమయంలో బ్రిడ్జి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. బ్రిడ్జి కూలిపోవడానికి కారణమేంటనే విషయం గుర్తించేందుకు విచారణ జరిపిస్తామని తెలిపారు. కాగా, బిహార్ లో ఈ వారంలోనే బ్రిడ్జిలు కూలిన ఘటన ఇది మూడోది. గత మంగళవారం అరారియా జిల్లాలో 180 మీటర్ల బ్రిడ్జి కూలిపోయింది. శనివారం సివన్ జిల్లాలో ఓ వంతెన కూలిపోయింది. కూలిన బ్రిడ్జిలు మూడూ నీటి ప్రవాహాల ( నీటి కాలువలు,  నదులు) పై నిర్మించినవే కావడం గమనార్హం. వరుసగా బ్రిడ్జిలు కూలిపోతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిల వంటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కాంట్రాక్టర్లు గాలికి వదిలేస్తున్నారని, ఫలితంగా అవి పేకమేడల్లా కూలిపోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.