తెలంగాణ యూత్కు రష్యాలో 4 లక్షల జాబ్స్! టామ్ కామ్ ఆధ్వర్యంలో త్వరలో ఉద్యోగాలు

తెలంగాణ యూత్కు రష్యాలో 4 లక్షల జాబ్స్! టామ్ కామ్ ఆధ్వర్యంలో త్వరలో ఉద్యోగాలు
  • 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించేందుకు సర్కారు సన్నాహాలు
  •     5 రోజుల నుంచి రష్యాలో పర్యటిస్తున్న సీఎం సెక్రటరీ అజిత్ రెడ్డి, దాన కిషోర్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓవర్ సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) ఆధ్వర్యంలో త్వరలో రష్యాలో తెలంగాణ యువతీయువకులు కొలువులు సాధించనున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ అధికారుల ఆహ్వానం మేరకు సీఎం సెక్రటరీ అజిత్ రెడ్డి, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, టామ్ కామ్ జీఎం నాగభారతి రష్యాలో పర్యటిస్తున్నారు. 

ఈ టూర్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఇందులో భాగంగా రష్యా దేశ అధికారులు, కంపెనీల ఉన్నతాధికారులతో మన ఆఫీసర్లు చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో ఐటీఐ, ఏటీసీల్లో అందిస్తున్న కోర్సులు, ఆ కోర్సులు పూర్తి చేసిన తరువాత ఉపాధి అవకాశాలను వివరిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు టామ్ కామ్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.

తెలంగాణ నిరుద్యోగులను రష్యాకు పంపిస్తం..

ఇండియా, రష్యా మధ్య 70 ఏండ్ల నుంచి మంచి వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. రష్యాలో 30 లక్షల జాబ్స్ ఉన్నట్టు ఆ దేశ రిపోర్ట్ ల ద్వారా తెలిసింది. వేల కోట్లతో టెక్నికల్ స్కిల్స్ పెంచేందుకు తెలంగాణ లో ఐటీఐలను అప్ గ్రేడ్ చేస్తూ.. కొత్తగా టాటా టెక్నాలజీ, ప్రభుత్వం కలిపి అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను ఏర్పాటు చేశాం.  మా టెక్నికల్ స్కిల్స్ స్టూడెంట్స్ రష్యాలో జాబ్ లు సాధించేందుకు ఉపయోగపడ నున్నాయి. 

ఏఐ టెక్నాలజీతో గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నం. ఇంగ్లిష్ వచ్చిన వాళ్లకు రష్యాలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణలో టాలెంట్ ఉన్న యువతను గుర్తించి టామ్ కామ్ ద్వారా, ఐటీఐ, ఏటీసీల్లో అవసరమైన స్కిల్స్ నేర్పించి రష్యాలో ఉద్యోగాలు కల్పించటానికి కృషి చేస్తం.– దాన కిషోర్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ