
తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. మధురైలోని రాజాజీ ఆస్పత్రికిలోకి సోమవారం ఉదయం నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో ప్రవేశించి, చికిత్స పొందుతున్న రోగిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో రోగి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రాజాజీ ఆస్పత్రి వద్దకు వెళ్లి హత్య జరిగిన పేషేంట్ రూమ్ ను పరిశీలించారు.
చనిపోయిన పేషెంట్ వి.మురుగన్(40) గా పోలీసులు గుర్తించారు. 2019 లో పట్టా రాజశేఖర్ అనే వ్యక్తి హత్యకు సంబంధించిన కేసులో మురుగన్ అరెస్టయ్యాడు. అయితే అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన మురుగన్ ను పక్కా ప్లాన్ ప్రకారమే సోమవారం ఉదయం 5:30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు మారణాయుధాలతో హత్య చేసినట్టు వారు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నవెూదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆస్పత్రిలో హత్య జరిగే సరికి మిగతా రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా వెూహరించారు.