
మణిపూర్ లో హింసాత్మక ఘటనలపై కేంద్ర దృష్టి సారించింది. ఒక్కరోజే 40మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఈ సందర్భంగా తిరుగుబాటుదారులను ఆయనఉగ్రవాదులతో పోల్చారు.
"పౌరులపై ఉగ్రవాదులు M-16, AK-47 అటాల్ట్ రైఫిల్స్, స్నిపర్ గన్‌లను ఉపయోగిస్తున్నారు. వారు ఇళ్లను తగలబెట్టడానికి ఇప్పటికే చాలా గ్రామాల్లో దాడులు చేశారు. మేము సైన్యం, ఇతర భద్రతా బలగాల సహాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించాము. దాదాపు 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు మాకు నివేదికలు అందాయి" అని సింగ్ అన్నారు. ఉగ్రవాదులు నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరుపుతున్నారని, మణిపూర్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోన్న సాయుధ ఉగ్రవాదులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పోరాటం జరుగుతోందని ఆయన చెప్పారు.
మే 29న తెల్లవారుజామున 2 గంటలకు ఇంఫాల్ లోయ, చుట్టుపక్కల ఐదు ప్రాంతాలపై తిరుగుబాటుదారులు ఏకకాలంలో దాడి చేసినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని ఎదురుకాల్పులు జరిపారని, ఇప్పటికీ కొన్ని చోట్ల కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఫాయెంగ్‌లో జరిగిన కాల్పుల్లో గాయపడిన 10 మంది బుల్లెట్ గాయాలతో ఫయేంగ్ లోని రిమ్స్ ఆస్పత్రిలో చేరినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం మణిపూర్ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర, కేంద్ర బలగాలు పెద్ద మొత్తంలో ఆయన పర్యటించే ప్రాంతాల్లో మోహరించాయి. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.