గతేడాదితో పోలిస్తే పటాకులకు 40 శాతం పెరిగిన రేట్లు

గతేడాదితో పోలిస్తే పటాకులకు 40 శాతం పెరిగిన రేట్లు
  • పూల ధరలు సైతం డబుల్
  • సిటీలో పండుగ సందడి షురూ
  • షాపింగ్​తో రద్దీగా మార్కెట్లు

సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో దీపావళి సందడి మొదలైంది. పండుగకు మరో రెండ్రోజులే ఉండటంతో పటాకులు, పూలు, స్వీట్స్, బట్టల కొనుగోళ్లతో మార్కెట్లు, స్వీట్ షాపులు, షాపింగ్ మాల్స్ రద్దీగా మారాయి. అయితే ఈ సారి పటాకులు, పూల రేట్లు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. వారం రోజుల కిందటి వరకు కిలో చామంతి రూ.100 నుంచి 150 ఉండగా.. ప్రస్తుతం రూ.250కు అమ్ముతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇండ్లు, షాపుల్లో అలంకరణకు, లక్ష్మీ పూజ కోసం వాడే పూల రేట్లు సైతం భారీగా పెరిగాయి. దసరా  తర్వాత బంతి పూలు కిలో రూ.50 ఉండగా.. ప్రస్తుతం వాటి ధర రూ.90 పలుకుతోంది. వీటితో పాటు జాజిపూలు, గులాబీలకు సైతం డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారులు అంటున్నారు. 

60 మున్సిపల్ గ్రౌండ్స్ లో క్రాకరీ షాప్​లు

ఇక పటాకుల్లో ప్రతి ఐటెమ్ పై 30 నుంచి 40 శాతం పెరిగినట్లు క్రాకర్స్ నిర్వాహకులు చెబుతున్నారు. దీపావళికి పటాకులు అమ్మేందుకు క్రాకర్స్ షాప్​ల ఏర్పాటు కోసం  ఈ నెల20 వరకు అధికారులు  దరఖాస్తులు స్వీకరిం
చారు.  కంటోన్మెంట్ పరిధిలోని జింఖానా గ్రౌండ్​లో 35 షాప్​లకు ఫైర్ డిపార్ట్​మెంట్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. ఇదే క్రమంలో బల్దియా పరిధిలోని 6 జోన్లలో 60 మున్సిపల్ గ్రౌండ్స్ ను గుర్తించిన అధికారులు అందులోనే  క్రాకరీ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ పొందిన నిర్వాహకులకు శుక్రవారం ప్లేస్ అలాట్ చేయడంతో పటాకుల అమ్మకాలు, కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

పెరిగిన లైసెన్స్ రేట్లు..

గతేడాది కంటే ఈ సారి క్రాకరీ షాప్​ల ఏర్పాటుకు సంబంధించి​ లైసెన్స్​ రేట్లను భారీగా పెంచారు.  గతంలో రిటైల్ షాపులకు లైసెన్స్ రూ. వెయ్యి నుంచి రూ.5 వేలు, హోల్​సేల్​కు రూ.8 వేల నుంచి రూ.10 వేల మధ్య ఉండేది. ఈ సారి రిటైల్ షాప్ ఏర్పాటుకు రూ.9 వేల నుంచి రూ.20 వేల మధ్య, హోల్ సేల్ కు రూ.20 వేల నుంచి  రూ.55 వేలుగా లైసెన్స్ రేట్లు ఉన్నాయి. గతంలో తమిళనాడులోని శివకాశి నుంచి వచ్చే  ఒక లారీ పటాకుల లోడ్​కు రూ.2 లక్షల 50 వేలు కాగా, పెరిగిన డీజిల్ రేట్లు, జీఎస్టీ ప్రభావంతో ఈ సారి ఒక లారీ లోడ్ రూ. 3 లక్షల 40 వేలు అయ్యింది. దీంతో  పటాకుల రేట్లు కూడా పెంచినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు చైనా క్రాకర్స్​పై నిషేధం ఉందని.. వాటిని ఎక్కడైనా అమ్ముతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని ఫైర్ డిపార్ట్​మెంట్ అధికారులు తెలిపారు. ఆకట్టుకునే రంగు రంగుల దీపాలు పండుగ కోసం మార్కెట్​లో రకరకాల రంగుల్లో ఆకట్టుకునే దీపాలు అందుబాటులోకి వచ్చాయి. మట్టి దీపాలను వాడేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటంతో షాపింగ్ మాల్స్​లోనూ వాటిని అమ్ముతున్నారు. ప్రస్తుతం మట్టి దీపాల రేటు డజను రూ.40 నుంచి  రూ.100 వరకు ఉంది.  కొంత ఆకర్షణీయంగా కనిపించే దీపాల రేటు డజను రూ.200గా ఉంది.

పటాకులతో మెట్రో రైళ్లలో ప్రయాణం నిషేధం

మెట్రోలో పటాకులను తీసుకెళ్లడంపై నిషేధం విధిస్తున్నట్లు హైదరాబాద్ ​మెట్రో రైల్ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అన్ని మెట్రో స్టేషన్లలో ఎంట్రీ పాయింట్ల వద్ద హెచ్చరిక బోర్డులను  ఏర్పాటు చేశామన్నారు. రూల్స్ పాటించని ప్యాసింజర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.