ఎన్ని నెలలైనా యుద్ధం చేస్తం..హమాస్ టన్నెల్స్​లో 40 వేల మంది ఫైటర్లు రెడీగా ఉన్నారు

ఎన్ని నెలలైనా యుద్ధం చేస్తం..హమాస్ టన్నెల్స్​లో 40 వేల మంది ఫైటర్లు రెడీగా ఉన్నారు

గాజా/జెరూసలెం:  ఇజ్రాయెల్ బలగాలతో ఎన్ని నెలలైనా యుద్ధం చేయడానికి సిద్ధమని, అందుకోసం కావాల్సినన్ని వెపన్స్, మెడిసిన్స్, ఫుడ్ తమ వద్ద ఉన్నాయని హమాస్ మిలిటెంట్ గ్రూప్ ప్రతినిధులు ప్రకటించారు. గాజా సిటీ కింద భూగర్భంలో ఉన్న వందలాది కిలోమీటర్ల టన్నెల్స్ లో 40 వేల మంది ఫైటర్లు రెడీగా ఉన్నారని వెల్లడించారు. తమతో గాజా సిటీలో నేరుగా తలపడుతున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బలగాలపై గెరిల్లా దాడులతో చికాకు పెట్టాలన్నదే ప్లాన్ అని హమాస్ మిలిటెంట్లను ఉటంకిస్తూ రాయిటర్స్ ఓ కథనం వెలువరించింది. యుద్ధాన్ని సాగదీస్తే అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగి ఇజ్రాయెల్ దిగొచ్చి కాల్పుల విరమణకు ఒప్పుకుంటుందని భావిస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పైకి వేలాది రాకెట్లు ప్రయోగించి ముప్పేట దాడికి తెగబడిన హమాస్ మిలిటెంట్లు అంతకుముందే దీర్ఘకాలిక యుద్ధానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు వెల్లడించింది. హమాస్ వద్ద ఇప్పుడు పెద్ద ఎత్తున వెపన్స్​, 200 కి.మీ. దూరం సైతం వెళ్లే మిసైళ్లు ఉన్నాయని పేర్కొంది.

అమెరికా విజ్ఞప్తికి ఇజ్రాయెల్ నో 

పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించడం కోసం కాల్పులు ఆపాలంటూ అమెరికా చేసిన విజ్ఞప్తికి ఇజ్రాయెల్ నో చెప్పింది. బందీలను విడిచిపెట్టేదాకా హమాస్​పై దాడులు ఆగబోవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు. అలాగే గాజా సిటీలోని అల్ షిఫా ఆస్పత్రి వద్ద అంబులెన్స్ ల కాన్వాయ్, రెఫ్యూజీ క్యాంపులపై దాడులనూ అమెరికా తప్పుపట్టింది. దీనిపై ఇజ్రాయెల్ స్పందిస్తూ.. తాము కచ్చితమైన సమాచారంతో మిలిటెంట్ కమాండర్లు ఉన్న ప్రాంతాలపై, వెపన్స్ తరలిస్తున్న అంబులెన్స్​లపై మాత్రమే దాడులు చేశామని పేర్కొంది. మరోవైపు యుద్ధం మొదలైన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం మూడోసారి ఇజ్రాయెల్​లో పర్యటించారు. శనివారం అరబ్ దేశాల ఫారిన్ మినిస్టర్లతో జోర్డాన్ లో భేటీ అయ్యారు.    

9,227కు పెరిగిన మృతులు

ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకూ 9,227 మంది చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. వెస్ట్ బ్యాంక్​లో మరో 140 మంది పాలస్తీనియన్లు మరణించారని తెలిపింది. యూఎన్​కు చెందిన 72 మంది సిబ్బంది కూడా మృతిచెందారు.