లక్ష 20 వేల మంది ఉద్యోగులను తీసేసిన స్టార్టప్ కంపెనీలు

 లక్ష 20 వేల మంది ఉద్యోగులను తీసేసిన స్టార్టప్ కంపెనీలు

ముంబై:  మనదేశంలో ఒకప్పుడు విజృంభించిన స్టార్టప్ ఎకోసిస్టమ్ ​ఊహించిన దానికంటే  తీవ్రమైన ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. స్టాఫింగ్​ సంస్థల నివేదికల ప్రకారం  వీటిలో లే-ఆఫ్‌‌‌‌లు పబ్లిక్‌గా వెల్లడించిన దానికంటే కనీసం మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి. గత 24 నెలల్లోనే 1,400కు పైగా కంపెనీలు దాదాపు 91వేల మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌‌‌‌లను ఇచ్చాయి. ఇతర విధానాల ద్వారా తీసేసిన ఉద్యోగాలనూ కలుపుకుంటే ఈ సంఖ్య 1.20 లక్షలు దాటుతుందని టెక్-ఫోకస్డ్ హైరింగ్ సంస్థ టాప్​హైర్ తెలిపింది. బైజూస్, అన్​అకాడెమీ, బ్లింకిట్, మీషో, వేదాంతు, ఓయో, ఓలా, కార్స్24,  ఉడాన్ వంటి యునికార్న్‌‌‌‌లు (బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్టార్టప్​లు) తమ టీమ్‌‌‌‌ల సైజును భారీగా తగ్గించుకున్నాయి. 

పబ్లిక్‌‌‌‌గా అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. లే-ఆఫ్‌‌‌‌ల సంఖ్య 25,000–-28,000 వరకు ఉంది.  లిక్విడిటీ సంక్షోభం స్టార్టప్​లకు నిధుల సమస్యను తెచ్చిపెట్టింది. భారతదేశంలోని అనేక స్టార్టప్‌‌‌‌లు పొదుపును పెంచడానికి,  నెలవారీ ఖర్చులను తగ్గించడానికి ఉద్యోగులను తీసేయాల్సి వస్తోంది.  మరికొన్ని స్టార్టప్‌‌‌‌లు మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకోవడం, పొదుపు పెంచడం, ఉద్యోగుల ఖర్చులను తగ్గించడం వంటివి చేయవలసి వచ్చింది. పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక ప్రకారం, భారతీయ స్టార్టప్‌‌‌‌లు 2023 మొదటి అర్ధ భాగంలో  3.8 బిలియన్ డాలర్ల నిధులను పొందాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 36శాతం తక్కువ. గత నాలుగు సంవత్సరాలలో ఇదే అతి తక్కువ కావడం గమనార్హం.  ఫైనాన్షియల్​ టెక్నాలజీ, సాఫ్ట్‌‌‌‌వేర్- యాజ్​ ఏ -సర్వీస్ (సాస్​)  డైరెక్ట్ -టు -కన్జూమర్ కంపెనీలు 2023 మొదటి ఆర్నెళ్లలో అత్యధిక నిధులు సమకూర్చుకున్న స్టార్టప్‌‌‌‌లు. పీడబ్ల్యూసీ డేటా ఈ ఏడాది జనవరి– జూన్  మధ్య 298 డీల్స్  ​ద్వారా స్టార్టప్​లు 3.8 బిలియన్ డాలర్లు‌‌‌‌ పొందాయి.  సంవత్సరం క్రితం వీటికి 5.9 బిలియన్ డాలర్లు అందాయి. 

సగటున 65 జాబ్స్​..

“గత 24 నెలల్లో 1,400 కంపెనీలు ఉద్యోగులను తొలగించాయని అంచనా వేస్తున్నాం. అన్ని లే-ఆఫ్ రౌండ్‌‌‌‌లలో ఒక్కో కంపెనీకి సగటున 65 ఉద్యోగాలకు కోత పెట్టింది. మొత్తం కలిపితే దాదాపు 91 వేలు అవుతుంది" అని టెక్-ఫోకస్డ్ స్టాఫింగ్ కంపెనీ టాప్​హైర్​ కో–ఫౌండర్​  సిద్ధార్థ్ గోపి చెప్పారు.  స్టార్టప్‌‌‌‌లు నివేదించిన సంఖ్యల కంటే కనీసం రెండింతలు ఎక్కువగా లేఆఫ్​లు ఉన్నాయని ఏబీసీ కన్సల్టెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శివ్ అగర్వాల్ తెలిపారు. వీటి వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌లో ఎక్కువగా ఉన్న కన్సల్టెంట్లు,  కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసివేతలను ఇవి చూపించడం లేదు.  

క్వెస్ కార్ప్ వర్క్‌‌‌‌ఫోర్స్ మేనేజ్‌‌‌‌మెంట్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ లోహిత్ భాటియా మాట్లాడుతూ,  స్టార్టప్​లు ఉద్యోగుల తొలగింపుల గురించి వెల్లడించడం లేదని, కాంట్రాక్టు ఉద్యోగులనూ ఇవి పెద్ద సంఖ్యలో  నియమించుకుంటాయని చెప్పారు. వీరిలో ఫిక్స్​డ్​ టర్మ్, గిగ్​ వర్కర్లు, ఫ్రీలాన్స్ నిపుణులు ఉంటారని వివరించారు.  ఇటీవల ఒక ఫిన్‌‌‌‌టెక్ 250–-400 మంది ఉద్యోగులను తొలగించినట్టు వార్తలు వచ్చాయి. 

అసలు సంగతి ఏమిటంటే ఇది 750 మందిని తొలగించిందని ఈ సంగతి తెలిసిన వాళ్లు  చెప్పారు. ఇలా చాలా జరుగుతుంటాయని అన్నారు. ఏ కంపెనీ కూడా లే-ఆఫ్‌‌‌‌ల గురించి పూర్తిగా వెల్లడించదని, భారీగా అండర్ రిపోర్టింగ్ ఉంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ ఒకరు వివరించారు.