బెంగుళూర్: కర్నాటక రాజధాని బెంగుళూరులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై గుంత మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. బైక్ మీద వెళ్తున్న ఓ బ్యాంక్ ఎంప్లాయ్ రోడ్డుపై గుంత కారణంగా బైక్ పై నుంచి కిందపడిపోయింది. ఈ క్రమంలో వెనక నుంచి దూసుకొచ్చిన ట్రక్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
వివరాల ప్రకారం.. 26 ఏళ్ల ప్రియాంక కుమారి పూనియా బెంగళూరులోని వన్‌సేవింగ్స్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. ప్రియాంక సోదరుడు నరేష్ రోజు ఆమెను బ్యాంక్ దగ్గర బండిపై డ్రాప్ చేస్తాడు. రోజు మాదిరిగానే శనివారం (అక్టోబర్ 25) కూడా తన సోదరుడు నరేష్ బైక్‌పై ఆఫీస్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో హోస్కూరు రోడ్డు సమీపంలో రోడ్డుపై గుంత కారణంగా ఓ కారు సడెన్‌గా ఆగిపోయింది. ముందున్న కారు ఒక్కసారిగా ఆగిపోవడంతో నరేష్ సడెన్ బ్రేక్ వేశాడు.
దీంతో నరేష్, ప్రియాంక ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రక్ ప్రియాంక తల మీది నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదంలో నరేష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు నరేష్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రియాంక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై మరోసారి చర్చకు దారి తీసింది.
ప్రియాంక ప్రమాదానికి గురై మృతి చెందిన రోడ్డు గత ఏడు నెలలుగా అధ్వానంగానే ఉన్నట్లు స్థానికులు ఆరోపించారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం లేదని.. ఎన్ని ప్రాణాలు పోయినా అధికారుల్లో చలనం రావడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక కుమారి పూనియా మరణం ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమేనని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
