- రిజర్వ్ షాపులకు బినామీలు
- రెండేండ్ల కింద కంటే తగ్గిన దరఖాస్తులు
- అర్బన్ కంటే పల్లె వైన్స్లకే అధిక పోటీ
- ఫీజు పెంపుతో సర్కార్‌కు భారీ రాబడి
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : నిజామాబాద్ జిల్లాలో 102 వైన్స్ షాపులు, కామారెడ్డి జిల్లాలో 49 మద్యం దుకాణాలు ఉన్నాయి. కొత్త లైసెన్స్‌ల కోసం శుక్రవారం గడువు ముగిసే నాటికి నిజామాబాద్‌లో 2786 అప్లికేషన్లు, కామారెడ్డిలో 1,502 అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తుల కోసం ప్రభుత్వం గడువు పెంచినప్పటికీ అంతగా స్పందన రాలేదు.
ప్రభుత్వం నాన్ రిఫండబుల్ ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. 2023లో నిజామాబాద్ జిల్లాలో 3759 అప్లికేషన్లు రాగా, కామారెడ్డి జిల్లాలో 1940 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో పోయినసారి ప్రభుత్వానికి రూ.75.18 కోట్ల ఆదాయం సమకూరగా, ఈసారి రూ.83.58 కోట్ల ఆదాయం వచ్చింది.
విలేజ్ షాపులపై ఆసక్తి
గ్రామాల్లో మద్యం దుకాణాల కోసం పోటీ అధికంగా కనిపించింది. నిజామాబాద్ జిల్లాలో 102 షాపులు ఉండగా, నిజామాబాద్ నగరంలోని 25, బోధన్‌లో 5, ఆర్మూర్ టౌన్‌లోని 11, భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 4 కలిపి మొత్తం 45 అర్బన్ షాపులకు 1,132 అప్లికేషన్లు వచ్చాయి. పల్లె ప్రాంతాల్లోని మిగతా 57 వైన్స్ షాపులకు 1654 దరఖాస్తులు వచ్చాయి.
అందులో ఎర్గెట్ల షాప్ కోసం అత్యధికంగా 96 అప్లికేషన్లు రాగా, ఆలూరు వైన్స్ కోసం 74, వేల్పూర్ షాపునకు 69 దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ అన్రిజర్వ్డ్ దుకాణాలు కావడం విశేషం. 27న భారతీ గార్డెన్లో లాటరీ ద్వారా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి షాపులను కేటాయించనున్నారు.
కామారెడ్డి జిల్లాలో దరఖాస్తులు ఇలా..
కామారెడ్డి పరిధిలో 15 షాపులు ఉండగా 467 దరఖాస్తులు వచ్చాయి. దోమకొండ పరిధిలోని 8 దుకాణాలకు గాను 317 అప్లికేషన్లు, ఎల్లారెడ్డి పరిధిలోని 7 షాపులకుగాను 236, బాన్సువాడ పరిధిలోని 9 షాపులకు 249, బిచ్కుంద పరిధిలోని 10 షాపులకు 233 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా తాడ్వాయి మండల కేంద్రంలోని షాపునకు 59, రాజంపేట మండల కేంద్రంలోని షాపునకు 58 దరఖాస్తులు వచ్చాయి. ఈ 2 మండలాల్లో బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్న దృష్ట్యా పోటీ ఏర్పడింది. కొన్ని చోట్ల వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ అప్లికేషన్లు వేశారు.
అంచనాలు తారుమారు
రెండేండ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ వైన్స్ షాపులకు కొత్త లైసెన్స్‌లు జారీ చేసింది. ఎన్నికల టైం కావడంతో భారీగా పోటీ నెలకొంది. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండడంతో నిజామాబాద్జిల్లాలో 3759 అప్లికేషన్లు వచ్చాయి. ప్రస్తుతం లోకల్‌బాడీ ఎన్నికలు ఉన్నందున అప్లికేషన్లు రెట్టింపు అవుతాయని అంచనా వేసినా ఫీజు పెంపుతో దరఖాస్తులు తగ్గాయి. పది మందితో కూడిన గ్రూప్ తలా రూ.30 వేలు జమచేసి రూ.3 లక్షల ఫీజు చెల్లించారు. నిజామాబాద్జిల్లాలో 2 ఎస్టీ, 11 ఎస్సీ, 11 గౌడ్ వర్గానికి రిజర్వు చేసిన షాపులకు బినామీలు దరఖాస్తులు వేశారు.
