నల్గొండలో తొలిరోజు 43,534 అప్లికేషన్లు

నల్గొండలో తొలిరోజు 43,534 అప్లికేషన్లు
  • ఉమ్మడి జిల్లాలో ప్రజాపాలనకు అనూహ్య స్పందన
  • దరఖాస్తులు చేసుకునేందుకు భారీగా తరలివచ్చిన జనం
  • స్వయంగా అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు

నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, వెలుగు: అభయాస్తం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అనూహ్య స్పందన వస్తోంది. గురువారం అధికారులు గ్రామాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వీరేశం, బీర్ల అయిలయ్య, మందుల సామెల్, కలెక్టర్లు హనుమంత్ జెండగే, వెంకట్‌రావు, జిల్లా అధికారులు ప్రజా పాలనను ప్రారంభించి.. స్వయంగా అర్జీలు తీసుకున్నారు. నోడల్ ఆఫీసర్‌‌  ఆర్‌‌వీ కర్ణన్‌ నల్లొండలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజాపాలనను పర్యవేక్షించారు. అధికారులు అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి.. రసీదు ఇవ్వాలని సూచించారు.   

నల్గొండలో 111 జీపీలు, 29 వార్డుల్లో..

నల్గొండ జిల్లాలో ఈరోజు 118 జీపీలు, పట్టణాల్లో 29 వార్డుల్లో 23,593 అప్లికేషన్స్, యాదాద్రి భువనగిరి జిల్లాలో 75 గ్రామాల్లో 11,132 అప్లికేషన్లు వచ్చాయి.  సూర్యాపేట జిల్లాలో 89 గ్రామ పంచాయతీల్లో 6134 అప్లికేషన్లు, 21 మున్సిపాలిటీల్లో 2670  అప్లికేషన్లు వచ్చాయి.  మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ లక్ష్మీ, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, దరఖాస్తుదారుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.  సూర్యాపేట జిల్లాలో  3425 కేంద్రాలు ఏర్పాటు చేసి 58 టీమ్స్ నియమించామని చెప్పారు.  

రేషన్ కార్డు లేకున్నా అప్లై చేయొచ్చు

మిర్యాలగూడ, వెలుగు:  అభయహస్తం గ్యారెంటీ స్కీమ్‌ల కోసం రేషన్ కార్డు లేకున్నా అప్లై చేసుకోవచ్చని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. ప్రజా పాలనలో భాగంగా మిర్యాలగూడలో 1 నుంచి 8 వార్డుల్లో ఏర్పాటు చేసిన సభలకు ఆయన హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తు ఫారాలను ప్రభుత్వం ఫ్రీగా  ఇస్తోందని ఎవరూ బయట కొనద్దని సూచించారు. ఎవరైనా డబ్బులు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, టౌన్ ప్రెసిడెంట్ నూకల వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు శాగ నాగలక్ష్మి జలంధర్ రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, చల్లా నాగమ్మ, కాంగ్రెస్ లీడర్లు మేకల శ్రీనివాస్, బంటు లక్ష్మీనారాయణ, అంబటి క్రిష్ణ, అవుట శ్రీనివాస్ ఉన్నారు.