అమెరికాలో ఉద్యోగాలు వదులుకుంటున్న వర్కర్లు

అమెరికాలో ఉద్యోగాలు వదులుకుంటున్న వర్కర్లు
  • ఎక్కువ జీతం, మంచి జాబ్ కోసమే కొనసాగుతున్న రిజిగ్నేషన్లు 
  • ఆగస్టులో 43 లక్షల మంది.. ఏడాది మొత్తం 3.44 కోట్ల మంది
  • అమెరికా కార్మిక శాఖ సర్వే

వాషింగ్టన్:  అమెరికాలో ఉద్యోగాలు వదులుకుంటున్నోళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గత ఆగస్టు నెలలో 43 లక్షల మంది తమ ఉద్యోగాలకు రిజైన్ చేయగా.. సెప్టెంబర్ లో 44 లక్షల మంది జాబ్ లు వదులుకున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా 3.44 కోట్ల మంది తమ జాబ్ లకు రిజైన్ చేశారని అమెరికా లేబర్ డిపార్ట్ మెంట్ నిర్వహించిన ‘జాబ్ ఓపెనింగ్స్ అండ్ లేబర్ టర్నోవర్ సర్వే’లో వెల్లడైంది. నిరుడు కూడా దేశవ్యాప్తంగా 3.63 కోట్ల మంది జాబ్ లు వదిలేశారని తేలింది. కరోనా వ్యాప్తి తర్వాత ఆఫీసులకు, ఫ్యాక్టరీలకు, షాపులకు వెళ్లి పని చేసేందుకు ఉద్యోగులు అంతగా ఇంట్రస్ట్ చూపించకపోవడం, జాబ్ మారితేనే ఎక్కువ జీతం, ఇతర మంచి బెనిఫిట్స్ దొరికే చాన్స్ ఉండటంతో చాలా మంది ఉద్యోగాలకు రిజైన్ చేసి, కొత్త కొలువుల వేటలో పడుతున్నారని నిపుణులు చెప్తున్నారు. 

ఈ రంగాల్లోనే ఎక్కువ.. 
హోటల్స్, ఆర్ట్స్, ఎంటర్ టైన్ మెంట్, రీక్రియేషన్, రిటైల్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్ ఇండస్ట్రీల్లోని ఉద్యోగులు ఎక్కువగా జాబ్ లు వదులుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. కొందరు లోకల్, స్టేట్ గవర్నమెంట్ జాబ్ లకు కూడా రిజైన్ చేస్తున్నారని తేలింది. చాలా చోట్ల రిజిగ్నేషన్లు స్పీడ్ గా కొనసాగుతుండటంతో మొత్తం స్టాఫ్​అంతా ఖాళీ అయి ఎంప్లాయర్స్ తలలు పట్టుకుంటున్నట్లు నిపుణులు వెల్లడించారు. ఖాళీ అవుతున్న స్థానాల్లో మళ్లీ అంతే సంఖ్యలో వర్కర్లను నియమించుకోవడం కత్తిమీద సాములా మారుతోందని అంటున్నారు. 

సెప్టెంబర్ లో కోటి జాబ్స్ కు ప్రకటనలు  
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 1.04 కోట్ల జాబ్ ఓపెనింగ్స్ నమోదైనట్లు లేబర్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. వీటిలో ఎక్కువగా హెల్త్ కేర్, సోషల్ అసిస్టెన్స్, స్టేట్, లోకల్ గవర్నమెంట్, హోల్ సేల్ ట్రేడ్ వంటి రంగాల్లో ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రకటనలు వచ్చాయని తెలిపింది. జాబ్స్ వదిలేస్తున్న వాళ్లే ఎక్కువగా ఉండటంతో సెప్టెంబర్ లో ప్రతి 10 ఉద్యోగాలకు ఏడుగురు అభ్యర్థులే దొరికినట్లు ఎమ్సి బర్నింగ్ గ్లాస్ సీనియర్ ఎకనమిస్ట్ రాన్ హెట్రిక్ వెల్లడించారు. సౌత్, వెస్ట్ జాబ్ మార్కెట్స్ లో ఇంకా తక్కువ మందే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కరోనా భయం కారణంగానే హెల్త్ కేర్, ట్రాన్స్ పోర్టేషన్, వేర్ హౌజింగ్ ఉద్యోగాలపై జనం ఇంట్రస్ట్ చూపడంలేదన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉద్యోగాలకు రిజైన్ చేస్తున్నోళ్ల సంఖ్య ఎక్కువగా ఉందని జిప్ రిక్రూటర్ సంస్థ చీఫ్​ఎకనమిస్ట్ జూలియా పొలాక్ వెల్లడించారు. వచ్చే ఏడాది కూడా ఉద్యోగుల రిజిగ్నేషన్లు కొనసాగొచ్చన్నారు.