సర్కారు, విద్యాశాఖ తప్పిదాలతో కోర్టును ఆశ్రయిస్తున్న టీచర్లు

సర్కారు, విద్యాశాఖ తప్పిదాలతో కోర్టును ఆశ్రయిస్తున్న టీచర్లు
  • వెంటవెంటనే డిస్పోజ్ చేస్తున్న హైకోర్టు 
  • అప్పీల్స్ ను సర్కార్ పట్టించుకోక పోవడంతోనే కోర్టుబాట
  • వెయ్యికిపైగా టీచర్లకుకోర్టు ద్వారానే న్యాయం

హైదరాబాద్, వెలుగు: కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులు, టీచర్ల సర్దుబాటు కోసం తెచ్చిన జీవో 317 పంచాయితీలు తెగడం లేదు. ఆ జీవో వచ్చి ఏడాది దాటినా సమస్యలు వస్తూనే ఉన్నాయి. జీవో 317 ఉత్తర్వుల అమలులో జరిగిన తప్పిదాలను సర్కారు, విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటివరకు స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే సుమారు 4,500కు పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయంటే, సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లాల్లో అధికారుల తప్పిదాలూ బయటపడుతున్నాయి. 

పట్టించుకోని సర్కార్ 

రాష్ట్రంలో టీచర్ల సర్దుబాటు కోసం ప్రభుత్వం 2021 డిసెంబర్ 6న జీవో 317 తీసుకొచ్చింది. సర్కారు, లోకల్ బాడీ స్కూళ్లలో పనిచేస్తున్న సుమారు1.05 లక్షల మంది టీచర్లను, హెడ్మాస్టర్లను 33 జిల్లాలు, మల్టీ జోన్లకు అనుగుణంగా సర్దుబాటు చేసింది. దీంట్లో వికలాంగులు, కారుణ్య నియామకాల ద్వారా వితంతువులుగా ఉన్న వారికి, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారికి ప్రయార్టీ ఇచ్చారు. సుమారు 25 వేల మంది టీచర్లు ప్రస్తుతం పని చేస్తున్న ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు మారారు. సొంత జిల్లాను వదిలి ఇతర జిల్లాలకు శాశ్వతంగా బదిలీ కావడంతో ఆ టీచర్లు ఆందోళన బాట పట్టారు. మరోపక్క19 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టి, 13 జిల్లాల్లో బదిలీలను బ్లాక్ చేశారు. సీనియార్టీ లిస్టుల్లో తప్పులు వస్తే బాధిత టీచర్ల డీఈవోలు, కలెక్టర్లను కలిసి విన్నవించినా.. సమస్య పరిష్కారం కాలేదు. కారుణ్య నియామకాల ద్వారా వచ్చిన వితంతువులకు మాత్రమే అవకాశమివ్వడం, మిగిలిన వారికి ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు.  

హైకోర్టే పెద్ద దిక్కు 

జిల్లాల్లో డీఈవోలు, కలెక్టర్లు, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, విద్యాశాఖ సెక్రటరీతో పాటు విద్యాశాఖ మంత్రి దృష్టికి జీవో 317 లోపాలు, సీనియార్టీ లిస్టుల్లో తప్పులను బాధిత టీచర్లు, సంఘాలు తీసుకుపోయినా పరిష్కారం కాలేదు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ముందు పదులు, వందల్లో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం సుమారు 4,500 మంది కోర్టును ఆశ్రయించినట్టు లెక్కలు చెప్తున్నాయి. వీటిలో 2 వేల వరకు స్పౌజ్ అప్పీల్స్, మిగిలినవి విడో, సింగిల్ ఉమెన్, సీనియార్టీ లిస్టుల్లో తప్పులు, లొకాలిటీ, వివిధ వ్యాధులకు ప్రయార్టీ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. వీటిలో 1,000కి పైగా కేసుల్లో బాధితులకు న్యాయం జరిగిందని అధికారులు చెప్తున్నారు. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరినప్పుడు వితంతువుగా ఉన్న వారికే కాకుండా, ప్రస్తుత వితంతువులకూ చాన్స్‌‌ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. విడో అప్పీల్స్ 250, మరో 750 వరకు సీనియార్టీ పిటిషన్లకు న్యాయం జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే పిటిషన్లను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించి డిస్పోజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అధికారులు వాటిని పరిశీలించి, వెంటవెంటనే డిస్పోజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కిందిస్థాయిలోని బాధితులకు సమాచారం ఇవ్వడంలో లోపం కన్పిస్తోంది. దీంతో బాధితులు మళ్లీ హైకోర్టు ఆర్డర్లు పట్టుకొని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు.

బదిలీల టైమ్​లో ఎక్కువైనయ్

ఇటీవల ప్రభుత్వం టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు షెడ్యూల్ ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయితే తమకు మళ్లీ న్యాయం జరగదని, చాలామంది బాధిత టీచర్లు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇటీవలే హైకోర్టులో 500 వరకూ పిటిషన్లు వేసినట్టు తెలిసింది. పిటిషన్లలో కొంతమందికి న్యాయం జరుగుతుండటంతో, అదే బాటలో మిగిలిన టీచర్లు వెళుతున్నారు. కొందరు టీచర్లు చిన్నచిన్న సమస్యలతో, తమ సొంత జిల్లాకే అలాట్ చేయాలని కేసులు వేస్తున్నారని అధికారులు చెప్తున్నారు. నేరుగా సెక్రటేరియేట్, ఫైనాన్స్ శాఖ నుంచే జీవో 317 బదిలీలు జరగడంతో, తప్పిదాలు ఎక్కువగా జరిగాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. కానీ వీటి పరిష్కారం కోసం మాత్రం మళ్లీ తమ వద్దకే అప్పీల్స్ వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. రోజూ సుమారు 10 నుంచి 30 పిటిషన్లు వస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఈ జీవో 317 పంచాయితీ ఇప్పట్లో తేగెలా కనిపించడం లేదని ఆఫీసర్లే చెప్తున్నారు.