హైదరాబాద్, వెలుగు: బీసీలకు 46% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ముస్లింలను బీసీ జాబితాలో చేరుస్తున్నారని విమర్శించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడారు. జ్యోతిరావుబాపూలే ఆశయాలకు అనుగుణంగా మోదీ సర్కారు పని చేస్తోందని తెలిపారు.
నరేంద్ర మోదీ అభినవ పూలే అని చెప్పారు. గత పాలకులు విస్మరించిన వర్గాలకు మోదీ సముచిత స్థానం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీసీలకు 30% సీట్లు కేటాయించారని వివరించారు. కేంద్రం విశ్వకర్మ యోజన పథకం ద్వారా బలహీన వర్గాలను ఆదుకుంటుందని వెల్లడించారు. బీసీలను ఓటు బ్యాంకుగా భావించే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.
