
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి 47 మంది ఎస్సీ విద్యార్థులు సెలక్ట్అయ్యారు. గురువారం సంక్షేమ భవన్‌లో విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ పథకానికి 54 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూలకు 50 మంది హాజరయ్యారు. వారిలో 47 మంది విద్యార్థులు అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా దేశాల్లో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్, సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, హ్యూమానిటీస్‌లలో పీజీ చేయడానికి ఎంపికయ్యారు.
వీరికి రెండేళ్ల ట్యూషన్ ఫీజులకు గాను ప్రభుత్వం రూ.20 లక్షలు, వీసా చార్జీలు, ఒకవైపు ఫ్లైట్ చార్జీ అందజేస్తుంది. ఓవర్సీస్ విద్యానిధితో అమెరికాలో పీహెచ్‌డీ చేయడానికి ఎం. సాయికిరణ్ అనే విద్యార్థి ఎంపికయ్యాడు. వైర్‌లెస్ కమ్యూనికేషన్స్‌లో ఐఐటీ రూర్కీ నుంచి మాస్టర్స్ పూర్తి చేసిన సాయికిరణ్ ఈ పథకం కింద ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో డాక్టరేట్ చేయడానికి విదేశాలకు వెళ్తున్న తొలి అభ్యర్థిగా నిలిచాడు. ఇంటర్వ్యూల్లో స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా, ఎస్సీ డెవలప్‌మెంట్ డైరెక్టర్ పి. కరుణాకర్, డీడీ బి. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.