రష్యాలో కూలిన ఫ్లైట్‌‌‌‌.. 48 మంది మృతి... ల్యాండింగ్‌‌‌‌కు ప్రయత్నిస్తున్న టైమ్‌‌‌‌లో ప్రమాదం

రష్యాలో కూలిన ఫ్లైట్‌‌‌‌..  48 మంది మృతి... ల్యాండింగ్‌‌‌‌కు ప్రయత్నిస్తున్న టైమ్‌‌‌‌లో ప్రమాదం

మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ ఫ్లైట్‌‌‌‌ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. అందులో ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 48 మంది ఉండగా, వాళ్లందరూ చనిపోయారు. అంగారా ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌కు చెందిన ఆంటోనోవ్ ఏఎన్‌‌‌‌–24 ఫ్లైట్‌‌‌‌ గురువారం 42 మంది ప్రయాణికులతో బ్లాగోవెష్‌‌‌‌చెన్స్క్ నుంచి చైనా సరిహద్దులో ఉండే టిండాకు బయలుదేరింది. మరికొన్ని నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా టిండా ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. 

ఆ తర్వాత మంటలు అంటుకుని కాలిపోయింది. ఈ ఘటనలో 42 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ ఫ్లైట్‌‌‌‌ ల్యాండింగ్ కోసం మొదటిసారి ప్రయత్నించినప్పుడు పరిస్థితులు అనుకూలించలేదని అధికారులు తెలిపారు. మళ్లీ రెండోసారి ప్రయత్నిస్తున్న క్రమంలో రాడార్ నుంచి తప్పిపోయిందని చెప్పారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ సర్వీసెస్ టీమ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టి, విమానం ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలినట్టు గుర్తించిందని పేర్కొన్నారు. 

ఈ ప్రమాదం నుంచి ఎవరూ బయటపడే అవకాశం లేదన్నారు. ఏరియల్ సర్వే సందర్భంగా స్పాట్‌‌‌‌లో ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు.  ప్రమాదానికి గురైన విమానం 50 ఏండ్ల క్రితం నాటిదని పేర్కొన్నారు. ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం, పైలెట్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కచ్చితమైన కారణమేంటన్నది ఇప్పుడే తెలియదన్నారు. ఈ ఘటనపై రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టీన్ విచారణకు ఆదేశించారు.