ఇంటర్​ ఫస్టియర్​లో పాసైంది 49 శాతమే

ఇంటర్​ ఫస్టియర్​లో పాసైంది 49 శాతమే
  • పాస్ పర్సంటేజీ 11% తగ్గింది.. 2,35,230 మంది స్టూడెంట్లు ఫెయిల్ 
  • వేలమందికి  సింగిల్ డిజిట్ మార్కులు.. సర్కారు కాలేజీల్లో మరీ దారుణం 
  • పాస్ పర్సంటెజీ 11 శాతం తగ్గింది 
  • 2,35,230 మంది స్టూడెంట్లు ఫెయిల్ 
  • వేలమందికి సింగిల్ డిజిట్ మార్కులు 
  • సర్కారు కాలేజీల్లో మరీ దారుణం 
  • ఇంటర్​ ఫస్టియర్ రిజల్ట్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్ గతంతో పోలిస్తే భారీగా పడిపోయింది. ఈ ఏడాది 49% మంది స్టూడెంట్లు పాస్ కాగా, 51% మంది ఫెయిల్ అయ్యారు. పాస్ పర్సంటేజీ ఏకంగా 11శాతం తగ్గింది. వేలమంది స్టూడెంట్లకు సబ్జెక్టుల్లో సింగిల్ డిజిట్స్ మార్కులొచ్చాయి. దీంతో స్టూడెంట్లు, పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఫలితాలను ఎప్పుడిస్తారనే విషయం అధికారికంగా ప్రకటించకుండానే.. ఆఫీసర్లు డైరెక్ట్​గా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెబ్​సైట్​లో పెట్టారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఫస్టియర్ స్టూడెంట్లకు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఫస్టియర్ ఎగ్జామ్స్ జరిగాయి. 4,59,242 మంది స్టూడెంట్లు పరీక్షలు రాశారు. వీరిలో 2,24,012 (49%) మంది పాస్ కాగా, 2,35,230 మంది ఫెయిల్ అయ్యారు. జనరల్ స్టూడెంట్లు 4,09,911 మందికి గాను 1,99,786 మంది, ఒకేషనల్ స్టూడెంట్లు 49,331 మందికి గాను 24,226 (49%)మంది పాసయ్యారు. ఫస్టియర్ ఫలితాల్లో ఎప్పటిలాగే అమ్మాయిల హవా కొనసాగింది. మొత్తం 2,26,616 మంది గర్ల్స్​కు గాను 1,26,289(56%) మంది పాసయ్యారు. 2,32,626 మంది బాయ్స్​కు గాను 97,723 (42%) మందే ఉత్తీర్ణత సాధించారు. మరిన్ని వివరాలను https://tsbie.cgg.gov.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ లో చూడొచ్చని అధికారులు తెలిపారు. ఫొటోలతోఉన్న మార్కుల మెమోలు శుక్రవారం సాయంత్రం నుంచి వెబ్​సైట్​లో ఉంచుతామని వెల్లడించారు. రీకౌంటింగ్, స్కాన్డ్ కాపీతో సహా రీవెరిఫికేషన్ కు ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

మేడ్చల్ టాప్..
ఫస్టియర్ రిజల్ట్​లో 63% పాస్ పర్సెంటేజీతో మేడ్చల్ జిల్లా టాప్​లో నిలిచింది. రెండో స్థానంలో ములుగు జిల్లా(61%), మెదక్ జిల్లా 22%తో చివరలో ఉంది. మేడ్చల్​లో 51,348 మందికి గాను 32,106 మంది పాసయ్యారు. మెదక్​లో 7,211 మందికిగాను 1,560 మందే పాస్ అయ్యారు. ఒకేషనల్​లో ములుగు జిల్లా 63శాతంతో టాప్​లో నిలవగా, నారాయణపేట, ఆసిఫాబాద్ జిల్లాల్లో 60% మంది పాసయ్యారు.

భారీగా తగ్గిన పర్సంటేజీ
2020లో ఫస్టియర్ ఫలితాల్లో 4,80,555 మందికి 2,88,383(60.01%) మంది పాసయ్యారు. అంటే కిందటేడాది కంటే ఈసారి 11% పాస్ పర్సంటేజీ తగ్గింది. ఫస్టియర్​లో 2019లో 60.47%, 2018లో 62.35% మంది ఉత్తీర్ణత సాధించారు. కానీ ఈ ఏడాది కరోనా, ఆన్​లైన్​ క్లాసుల​ఎఫెక్ట్ తో పాస్ శాతం భారీగా తగ్గింది. ఈసారి ఏ సబ్జెక్టులోనూ ఒక్క స్టూడెంట్ కూడా వందశాతం మార్కులు సాధించలేదు. చాలామందికి పదిలోపే మార్కులు వచ్చాయి. కొన్ని సబ్జెక్టుల్లో జీరోలు వచ్చాయి. ప్రైవేటు, సర్కారు కాలేజీలు అనే తేడా లేకుండా ఎక్కువ మందిది ఇదే పరిస్థితి. ఎంపీసీలో 467 అత్యధిక మార్కులు కాగా, బైపీసీలో 438, ఎంఈసీలో 494, సీఈసీలో 492, హెచ్​ఈసీలో 488 మార్కులొచ్చాయి.

సర్కారీలో పర్సంటేజీ ఎంత?
సర్కారు కాలేజీల్లో పర్సంటేజీని ఇంటర్ బోర్డు ప్రకటించలేదు. దీంతో అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. కిందటేడాది 64% మంది పాస్ కాగా ఈసారి దాంట్లో సగం పర్సంటేజీ కూడా రాలేదని తెలుస్తోంది. దీంతోనే వివరాలను గోప్యంగా ఉంచినట్లు సమాచారం. చాలా కాలేజీల్లో 20%లోపే పాస్ పర్సంటేజీ ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.