
- ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేషన్..
- అనుమతులు జారీ చేసిన బల్దియా
- తమ లేఅవుట్లో అసలు బై నంబర్లే లేవంటున్న కాలనీ అసొసియేషన్
చందానగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణకు గురి కాకుండా హైడ్రాను తీసుకువచ్చి యాక్షన్తీసుకుంటుంటే.. మరోవైపు కొంతమంది అధికారుల అండదండలతో చెరువు స్థలాలను కబ్జా చేస్తున్నారు. ముఖ్యంగా కోట్లలో ధర పలికే హైటెక్‌సిటీకి సమీపంలోని చెరువులను చెరబడుతున్నారు.
ఈ క్రమంలో శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట పరిధిలోని రేగులకుంట చెరువు స్థలాన్ని కొందరు పక్కనే ఉన్న దీప్తిశ్రీనగర్ కాలనీకి చెందిన ప్లాట్నెంబర్లకు బై నెంబర్లు వేసి కొట్టేశారు. వీరికి అండగా ఈ స్థలం చెరువుది కాదని ఇరిగేషన్ఎన్ఓసీ ఇవ్వగా, జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్‌అధికారులు నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ స్థలంలో ఇంటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
బై నంబర్లు వేసి బాజాప్తా కబ్జా..
హఫీజ్‌పేట్ పరిధి చందానగర్‌లోని దీప్తీశ్రీనగర్కాలనీకి ఆనుకొని రేకులకుంట చెరువు ఉంది. ఈ చెరువును 2014లో నోటిఫై చేసి లేక్నెం-3700/ఈఎన్/01గా కేటాయించి 15.238 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇందులోని 392 గజాల స్థలాన్ని కొందరు అక్రమార్కులు చెరువుకు అనుకొని ఉన్న దీప్తిశ్రీనగర్కాలనీ హెచ్ఎండీఏ లేఅవుట్లో ఉన్న ప్లాట్‌నంబర్513కి బై నెంబర్లు 513/2, 513/3, మరో ప్లాట్516కి ఈస్ట్రర్పార్ట్గా నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ, దీప్తిశ్రీనగర్ లేఅవుట్లో ఎలాంటి బై నంబర్లు లేవని కాలనీ అసొసియేషన్సభ్యులు చెప్తున్నారు.
అధికారుల అండదండలు పుష్కలం
చెరువును నోటిఫై చేసినప్పుడు చెరువు కట్ట నుంచి కబ్జా అయిన స్థలం బఫర్జోన్బయట ఉందని నార్త్ట్యాంక్డివిజన్డీఈఈ, ఏఈఈ ఎన్ఓసీ ఇచ్చారు. దీంతో అక్రమార్కులు స్థలానికి చెందిన రిజిస్ర్టేషన్డాక్యుమెంట్లు, సేల్‌డీడ్, ఇరిగేషన్‌శాఖ ఇచ్చిన ఎన్ఓసీతో కబ్జా చేసిన చెరువు స్థలంలో ఇంటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్టౌన్ప్లానింగ్ అధికారులను ఆశ్రయించారు.
ఇరిగేషన్‌శాఖ చెరువు స్థలం కాదని ఎన్ఓసీ ఇచ్చింది కదా అని 2023లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదంతస్థుల బిల్డింగ్నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులిచ్చారు. దీప్తిశ్రీనగర్కాలనీకి చెందిన లేఅవుట్1995లో హెచ్ఎండీఏ అప్రూవ్చేసింది. ఈ టైంలో లేఅవుట్లో ఎక్కడా బై నంబర్లు లేవు. కానీ, శేరిలింగంపల్లి జోనల్టౌన్ప్లానింగ్అధికారులు ఇవేమి పరిశీలించకుండానే ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చేశారు.
కబ్జా అయ్యిందంటూ 2020లో రెవెన్యూ రిపోర్టు
ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రేగులకుంట చెరువు స్థలం అన్యాక్రాంతం అవుతోందని 2020లో ఫిర్యాదు చేస్తే 2020లో రాజేంద్రనగర్డివిజన్డిప్యూటీ ఇన్స్పెక్టర్సర్వే చేశారు. దీప్తిశ్రీనగర్కాలనీలోని ప్లాట్‌నంబర్513, 515, 516, 517 రేగులకుంట చెరువుకు చెందిన1202 గజాల చెరువు స్థలాన్ని కబ్జా చేసినట్లు రిపోర్టు ఇచ్చారు. ఈ రిపోర్టులో ప్రస్తుతం బై నంబర్లు వేసి నిర్మిస్తున్న స్థలం కూడా చెరువు స్థలంగానే నిర్ధారించారు. ఇదే విషయమై ఇరిగేషన్డీఈఈగా పనిచేసి బదిలీ అయిన అధికారిని వివరణ కోరితే తాము 2014లో నోటిఫై అయిన చెరువు బఫర్జోన్ప్రకారం ఎన్ఓసీ ఇచ్చినట్టు చెప్పారు.
మా కాలనీలో బై నంబర్లే లేవు..
మాది1995లో హెచ్ఎండీఏ అనుమతించిన లేఅవుట్. ఇప్పుడు నిర్మాణం జరుపుకుంటున్న ప్లాట్నంబర్లు 5013/2, 513/3 అప్రూవ్లేఅవుట్లోఎక్కడా లేవు. కొందరు కాలనీ సొసైటీ మెంబర్లు మియాపూర్ సర్వే నంబర్101లోని ప్రభుత్వ స్థలంలో కాలనీకి చెందిన ప్లాట్నంబర్లకు బై నంబర్లు వేని కబ్జాలకు పాల్పడి కోట్లాది రూపాయలకు అమ్మేశారు. ప్రస్తుతం రేగులకుంటకు చెందిన స్థలంలో కూడా బైనంబర్లు వేసి కబ్జాకు పాల్పడి వేరే వ్యక్తులకు అమ్మేశారు. అప్రూవ్ లేఅవుట్లో లేని ప్లాట్నంబర్లకు బల్దియా ఎలా పర్మిషన్ఇచ్చిందో తెలియడం లేదు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
– సీతారామయ్య, దీప్తిశ్రీనగర్కాలనీ అసొసియేషన్ ప్రెసిడెంట్
రూ. 5 కోట్ల విలువైన చెరువు స్థలం కబ్జా చేసిండ్రు
హఫీజ్‌పేట్ పరిధిలోని సర్వే నెంబర్151లో ఉన్న రేగులకుంట చెరువుకు సంబంధించి1,202 గజాల స్థలాన్ని 2020లో కబ్జా చేశారు. రాజేంద్రనగర్ఆర్డీఓ కూడా స్థలం కబ్జాకు గురైందని సర్వే చేసి రిపోర్టిచ్చారు. ప్రస్తుతం ఇదే చెరువుకు చెందిన రూ.5 కోట్ల విలువైన 392 గజాల స్థలం కబ్జాకు గురైంది. దీనిపై ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైడ్రాకు ఫిర్యాదు చేసినం..వాళ్లు పట్టించుకోవడం లేదు. –
కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి,
జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు