
- ఎస్‌ఎంసీ చైర్పర్సన్లు, కమిటీ సభ్యుల ఆవేదన
- విద్యా శాఖలో పేరుకుపోతున్న బకాయిలు
- మూడేండ్ల నుంచి రూ. 5 కోట్లపైగా పెండింగ్
హైదరాబాద్, వెలుగు:‘‘నా కొడుకు చదువుతున్న సర్కార్ బడిల మూడేండ్ల కింద ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్‌గా నన్ను ఎన్నుకున్నరు. స్కూళ్ల కొన్ని పనులను చైర్పర్సన్లే చేయాలంటే.. మహిళా సంఘంల కొన్ని, బంగారం కుదవవెట్టి కొన్ని మొత్తం మూడు లక్షల రూపాయలు అప్పు తెచ్చి పనులు చేయించిన. నెలలనే ప్రభుత్వం నుంచి పైసలు అస్తయంటే నమ్మినం. కానీ మూడేండ్లు దగ్గరికచ్చింది. ఇప్పటికీ పైస రాలె. నెలనెల మిత్తి మీదపడుతుంది. కలెక్టరాఫీసు, డీఈవో ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయినం. మేమేమన్న పైసలున్నోళ్లమా..? లేకనే కదా సర్కారు బడిల మా పిల్లల్ని చదివిస్తున్నం. ఇప్పటికైనా మా బకాయి పైసలియ్యాలె…’’ ఇదీ వనపర్తి జిల్లా కేడీఆర్ నగర్ ప్రైమరీ స్కూల్ మేనేజ్హెంట్కమిటీ చైర్పర్సన్ శోభ ఆవేదన. ఇది కేవలం ఈమె ఒక్కరి ఆవేదనే కాదు.. వందలాది మంది ఎస్‌ఎంసీ చైర్పర్సన్లు, కమిటీ సభ్యులదీ ఇలాంటి పరిస్థితే.
రూ. 5 కోట్లకుపైగా బకాయిలు
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలో బకాయిలు పేరుకుపోతున్నాయి. బడుల్లో మూడేండ్ల కింద చేసిన చిన్నచిన్న పనులకు సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో అప్పులు చేసి, పనులు చేసిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్లు, కమిటీ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెచ్చిన అప్పులను తిరిగి చెల్లించలేక, వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. మూడేండ్లలో సుమారు రూ. 5 కోట్లకు పైగానే బకాయిలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 26 వేల ప్రభుత్వ స్కూళ్లుంటాయి. వీటికి ఏటా ప్లానింగ్ బడ్జెట్ కింద ఎన్నో కొన్ని నిధులు ఇస్తారు. ఇవన్నీ పెద్దపెద్ద నిర్మాణాలకు కేటాయిస్తారు. కానీ.. నాన్ ప్లానింగ్ కింద చేపట్టే చిన్నచిన్న పనులకు సంబంధించి మాత్రం మూడేండ్లుగా ఎలాంటి నిధులు విడుదల చేయడం లేదు. ఈ మూడేండ్ల కాలంలో బడుల్లో జరిగిన చిన్న చిన్న రిపేర్లు, నిర్మాణాల బకాయిలు భారీగా పేరుకుపోయాయి.
నమ్మకంతో పనులు చేస్తే..
బడుల్లో రిపేర్లు, పనులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చేయాల్సి ఉంటుంది. వీటికి రూ. 20 వేల నుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలా చేయిస్తే తమ పేరు నిలిచిపోతుందని తమ దగ్గర డబ్బులు లేకున్నా అప్పులు చేసి ఎస్‌ఎంసీ చైర్పర్సన్లు, సభ్యులు పనులు చేస్తుంటారు. అవి పూర్తయ్యేలోగా ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని నమ్ముతుంటారు. కానీ ప్రభుత్వం నిధులివ్వడం లేదు. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల బిల్లులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య విద్యాశాఖతో సంబంధం లేకుండా ఆర్థిక శాఖే నిధులు ఇస్తుండటంతో ఎన్నిచ్చారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో విద్యా శాఖకు క్లారిటీ లేకుండాపోతోంది.
నిలిచిన పనులు
సర్కారు నుంచి నిధులు రాకపోవడంతో ఈ ఏడాది ఎలాంటి పనులకూ పాఠశాల విద్యాశాఖ అనుమతులివ్వలేదు. దీంతో అనేక బడుల్లో చిన్నచిన్న పనులూ కూడా పెండింగ్‌లో పడిపోతున్నాయి. వర్షాకాలం కావడంతో గదులు ఉరుస్తున్నాయి. ప్రహరీగోడలు శిథిలావస్థలో ఉండగా, కొన్ని స్కూళ్లకు అవీ లేవు. రాష్ట్రంలోని సగం బడుల్లో బాత్‌రూమ్‌లను రిపేర్లు చేయాల్సి ఉంది. కొన్నింటిలో వాటర్ సప్లైలోనూ సమస్యలున్నాయి. ఇలా అనేక సమస్యలు నిధుల్లేక పరిష్కారానికి నోచుకోవడం లేదు.